విద్యావంతులకే ఓటు

People Voting For Graduate Candidates On Election In Balkonda - Sakshi

ఉన్నత విద్య అభ్యసించిన వారివైపే ‘బాల్కొండ’ ఓటర్ల మొగ్గు

ఒక్కరు మినహా అందరూ ఉన్నత విద్యావంతులే..

ఓటమి పాలైన వారు కూడా విద్యావంతులే

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): బాల్కొండ శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారిలో ఒక్కరు మినహా అందరూ ఈ నియోజకవర్గం ప్రజలు విద్యావంతులకే పెద్దపీట వేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బాల్కొండ నియోజకవర్గానికి 1952లో తొలిసారి ఎన్నిక జరుగగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌రెడ్డి అప్పట్లో హెచ్‌ఎల్‌సీ చదివారు. హెచ్‌ఎల్‌సీ ఉత్తీర్ణత చెందడం అప్పట్లో చాలా గొప్ప విషయమని మన పూర్వీకులు చెబుతున్నారు. హెచ్‌ఎల్‌సీ అంటే 12వ తరగతి అని అర్థం. అలాగే 1957 విజయం సాధించిన తుమ్మల రంగారెడ్డి కూడా హెచ్‌ఎల్‌సీ వరకు చదివి రాజకీయాల్లో ప్రవేశించారు. 1962, 1967, 1972, 1978 వరుసగా ఎమ్మెల్యేగా ఎంపికైన అర్గుల్‌ రాజారాం నిజాం కళాశాలలో బీఏ చదివారు. అప్పట్లో బీఏ చదవడం అంటే ఇప్పడు పీహెచ్‌డీతో సమానం అని పాత తరం వారు చెబుతున్నారు.

ప్రసిద్ధ నిజాం కళాశాలలో బీఏ చదవడం సాధారణ విషయం కాదని కూడా ఎంతో మంది చెబుతున్నారు. అర్గుల్‌ రాజారాం మరణం తరువాత 1981లో నిర్వహించిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైన సుశీలా బాయి మాత్రం సామాన్య గృహిణి ఆమె ప్రాథమిక విద్యను మాత్రమే పూర్తి చేశారు. 1983, 1985 ఎన్నికలలో గెలిచిన మధుసూదన్‌రెడ్డి కూడా హెచ్‌ఎస్‌సీ పూర్తి చేశారు. ఆయన ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించి తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారని పలువురు తెలిపారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన సురేశ్‌రెడ్డి నిజాం కళాశాలలో ఎంఏ ఎకనామిక్స్‌ పూర్తి చేశారు. అమెరికాలో పర్యావరణ శాస్త్రంలో ఎంఎస్‌ చదవడానికి సిద్ధం అవుతున్న సమయంలో ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో ఇక్కడే స్థిరపడిపోయారు. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు సందర్భోచితంగా ప్రసంగాలు ఇస్తూ అందరి మన్నలను అందుకున్నారు.

సురేశ్‌రెడ్డి వాక్చాతుర్యం వల్లనే ఆయనకు స్పీకర్‌ పదవి దక్కిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో పీఆర్‌పీ తరపున విజయం సాధించిన ఈరవత్రి అనిల్‌ ప్రసిద్ధ సీబీఐటీ కళాశాలలో బీఈ పూర్తి చేశారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించి అక్కడ కొంత కాలం స్థిరపడి రాజకీయాల్లో చేరడానికి స్వదేశానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి బీఈ సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు. ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఉన్నత విద్యావంతులు ఉన్నట్లే ఓటమి పాలైన వారిలోనూ ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉండడం గమనార్హం. 1994లో ఓటమి పాలైన బద్దం నర్సారెడ్డి 1966లో బీఏ పూర్తి చేశారు. 2004లో సురేశ్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూసిన వసంత్‌రెడ్డి హోమియో వైద్య డిగ్రీని పూర్తి చేశారు.

2009 ఎన్నికల్లో ఓటమిపాలైన శనిగరం శ్రీనివాస్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన అప్పట్లో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వదేశానికి వచ్చారు. ఓటమి పాలు కావడంతో మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన వేముల సురేందర్‌రెడ్డి కూడా ఎంఏ చదువును పూర్తి చేశారు. పలు సబ్జెక్టులలో ఎంఏ పట్టాలను అందుకున్న సురేందర్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడు కావడం విశేషం. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మల్లికార్జున్‌రెడ్డి వైద్య విద్యను పూర్తి చేశారు. ఆయన అపోలో ఆస్పత్రిలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా ఎంతో మంది బాల్కొండ బరిలో పోటీ చేసి గెలిచిన, ఓటమిపాలైన వారిలో ఉన్నత విద్యావంతులు ఉండటం విశేషంగా చెప్పవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top