మున్సిపల్‌ ఎన్నికల్లో తటస్థులకు గాలం

People Curious On Contesting For Municipal Elections - Sakshi

సాక్షి, గద్వాల: అన్నా.. రిజర్వేషన్‌ అనుకూలంగా వచ్చింది. మీ ఆశీర్వాదం ఉంటేనే నామినేషన్‌ దాఖలు చేసి ఎన్నికల బరిలోకి దిగుతా. లేకుంటే పోటీ నుంచి విరమించుకుంటా.. ఇలా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని వివిధ వార్డుల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ముందస్తుగా ఆయా వార్డుల్లోని ఇళ్లకు వెళ్లి ఓటు మాటను తీసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పట్టణాల్లో 77 వార్డులలో ప్రచారం చేస్తున్నారు.

ఓవైపు పలువురిని తమ పార్టీల్లో చేర్చుకుంటూనే, మరోవైపు తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఎవరికి అనుకూలంగా ఉన్న కుల సంఘాలను వారు కూడగట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఎటువైపు మొగ్గు చూపకుండా ఉండే ఓటర్ల మనసుని గెలిచేలా వ్యూహాన్ని అను సరిస్తున్నారు. ఎవరు చెబితే ఆ ఓటరు కుటుంబం తమవైపు మల్లుతుందో తెలుసుకొని వారితో చెప్పిస్తున్నారు. ఒకసారి తమకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు.

సమయం తక్కువగా ఉండటంతో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలవడం కష్టమైన ప్రక్రియగా పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థితోపాటు వేర్వేరుగా 4 నుంచి 6 బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరికి ద్వితీయశ్రేణి నాయకులు, మహిళా, విద్యార్థి విభాగాల నాయకులు సారథ్యం వహించేలా శ్రద్ధ కనబరుస్తున్నారు. అంతిమంగా ప్రతి ఇంటికి వెళ్లి ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలనే విషయం నేరుగా చేరడంతోపాటు ప్రచార కరపత్రాన్ని అందించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

గతంలో మాదిరిగా ఒకే వీధిలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వెళ్లడం లేదు. ఇలా వెళ్తే ఓటరుతో ఏకాంతంగా మాట్లాడేందుకు సమయం ఉండకపోవడం, ఒకరిద్దరు ఇళ్ల చెంతనే సమయం వృథా అవుతుండటంతో అసలు సందేశం ఓటర్లకు చేరడం లేదు. దీంతో కొత్త తరహాలో ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. ఇదే తీరును అన్ని పార్టీలోని వారు అవలంభిస్తున్నారు. ఒక చోటా.. మోటా నాయకులు తాము ప్రచారాన్ని ఫలానా కాలనీలో చేస్తాం. గరిష్టంగా ఇన్ని ఇళ్ల వాళ్లను కలిసి ప్రచారం చేస్తామని, ఇందుకయ్యే ఖర్చు భరించాలని అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

వార్డుల వారిగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండే ఓటరు మనస్సును గెలిచే ప్రయత్నాలు జోరవుతున్నాయి. ఇప్పటికే మహిళా సంఘాలు, కుల సంఘాలతో అభ్యర్థులు ఓటు మాటలను తీసుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల వీరికి గంపగుత్తగా ఉన్న ఈ ఓట్లు తమకే పడతాయనే ధీమాను ఆయా పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. పలుచోట్ల తటస్థంగా ఉన్న పెద్ద కుటుంబాల మద్దతు కోరేందుకు పోటీదారులు మక్కువ చూపిస్తున్నారు. రాజకీయ ఆర్భాటాలకు దూరంగా ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు, విభిన్నరంగాల్లో ఉన్న కుటుంబాల ఓట్లకు గాలం వేసేలా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top