పార్టీ అంటే పీకలదాకా తాగడమే..  | Sakshi
Sakshi News home page

శ్రుతిమించుతున్న బర్త్‌డే పార్టీలు!

Published Sun, Jul 22 2018 11:32 AM

Parents Is Be Careful In  Birthday Celebrations Nizamabad - Sakshi

సాక్షి, కామారెడ్డి: పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న నేటి యువత పుట్టిన రోజు వేడుకల పేరుతో చేస్తున్న హంగామా శృతిమించుతోంది. స్నేహితుడి బర్త్‌డే పార్టీ అంటే చాలు పదుల సంఖ్యలో జమ కావడం, అర్ధరాత్రి వరకు తాగి తూగడం, అల్లరి చేయడం ద్వారా అడ్డగోలుగా వ్యవహరిస్తూ రచ్చ చేస్తున్నారు. పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ పుట్టిన రోజు వేడుకల పేరుతో పార్టీలు జోరుగా సాగుతున్నాయి. పుట్టిన రోజు వస్తుందంటే నాలుగు రోజుల ముందుగానే ప్రోగ్రాం ఫిక్స్‌ చేసేస్తున్నారు. ఆ రోజు ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వేడుకల కోసం తమ స్థాయికి మించి కూడా ఖర్చు పెడుతున్నారు. తమ కొడుకు స్నేహితులతో కలిసి పుట్టిన రోజు జరుపుకుంటున్నాడంటే తల్లిదండ్రులు కూడా అడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు.

ఇక ఖర్చుకు డోకాలేదని స్నేహితులతో కలిసి మందుతో విందులు చేసుకోవడం, చిందులు వేయడం అలవాటుగా మారింది. దగ్గరి స్నేహితులంటూ 15 నుంచి 20 మంది వరకు ఉంటారు. వారిలో నెలలో ముగ్గురు, నలుగురి పుట్టిన రోజులు వస్తుంటాయి. ఇంకేముంది ఆయా రోజుల్లో పుట్టిన రోజు వేడుకల పేరుతో పీకలదాకా తాగి హంగామా చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో పుట్టిన రోజు వేడుకల పేరుతో అర్ధరాత్రుల్లో హంగామా చేసే గ్యాంగ్‌లు చాలానే ఉన్నాయి. పోలీసులు రాత్రుల్లో పెట్రోలింగ్‌ నిర్వహించే సమయంలో చాలా చోట్ల ఇలాంటి గ్యాంగులు తారసపడుతున్నా బర్త్‌డే పార్టీ కదా అని వదిలేస్తున్నారు. అయితే బర్త్‌డే పార్టీ పేరుతో చేస్తున్న హంగామా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
 
పార్టీ అంటే పీకలదాకా తాగడమే.. 
బర్త్‌డే పార్టీ అంటూ స్నేహితులంతా కలిసి పీకలదాకా మద్యం సేవిస్తున్నారు. తాగిన తరువాత వారి హంగామాకు అడ్డులేకుండాపోతోంది. అరుపులు, పెడబొబ్బలు పెట్టడం, డీజేలు ఏర్పాటు చేసుకుని పెద్ద సౌండ్‌తో నృత్యాలు చేయడం, తాగిన బాటిళ్లను పగులగొట్టడం వంటి వెర్రి పనులు చేస్తున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. సాధారణ కుటుంబాలకు చెందిన యువకులు సైతం తన బర్త్‌డే రోజున తక్కువలో తక్కువ రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఇక ఉన్నత వర్గాలకు చెందినవారి ఖర్చుకు లెక్కే లేదు. ఇలా స్నేహితుల్లో ఎవరి పుట్టిన రోజైనా సరే ఆ రోజు కచ్చితంగా విందులు చేసుకోవడం ఆనాయితీగా మారింది.
 
ఇరుగుపొరుగు వారికి ఇబ్బందే.. 
బర్త్‌డే పార్టీలంటూ అర్ధరాత్రి వరకు చేస్తున్న హం గామాతో ఇరుగుపొరుగు వారు ఇబ్బందులు పడు తున్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ఓ యువకుడి బర్త్‌డే పేరుతో సాయంత్రం నుంచి మొదలైన హంగామా అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఆ వీ ధిలో నివసించే కుటుంబాలన్నీ ఇబ్బంది పడ్డాయి. యువకులు పీకలదాకా మద్యం తాగి చేసిన హం గామాతో విసిగిపోయిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీ సులు వచ్చి వారించి వెళ్లారు. సాధారణంగా పుట్టిన రోజు అంటే కేక్‌ కట్‌ చేయిస్తారు. కాని కొం దరు తమ స్నేహితుడు కేక్‌ కట్‌ చేయగానే ముఖా న్ని కేకుపై రుద్దుతూ తమ ఆనందాన్ని చాటుకుంటారు. ఇదేం సంప్రదాయమో గాని రూ. వందలు ఖర్చు చేసి తెప్పించిన కేక్‌ను తలా కొంత తినకుం డా ముఖానికి రుద్దడం ద్వారా వేడుకల్లో ప్రత్యేకత అంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.
 
బైక్‌లపై హంగామా...
బర్త్‌డే వేడుకలు పూర్తి చేసుకున్న తరువాత చాలా మంది యువకులు బైకులపై తిరుగుతూ వాహనాల వేగాన్ని పెంచుతూ రోడ్లపై నానా హంగామా చేస్తున్నారు. బైక్‌ రేసింగ్‌లు చేస్తున్నారు. తాగిన మత్తులో యువత చేస్తున్న బైక్‌ రైసింగ్‌లతో రోడ్లపై వెళ్లే ఇతర వాహనాదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోనూ యువత బైక్‌ రైసింగ్‌లకు పాల్పడుతున్నారు. బైక్‌ రైసింగ్‌ ప్రాణాలు తీస్తుందని తెలిసినా చాలా మంది స్నేహితుల పుట్టిన రోజైనా ఎంజాయ్‌ చేయొద్దా అంటూ హంగామా చేస్తున్నారు.

నిత్యం ఏదో ఒక గ్యాంగులో ఎవరో ఒకరి పుట్టిన రోజు వస్తుండడంతో విందుల్లో మునిగితేలుతున్నారు. బర్త్‌డే పార్టీ వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అవసరమైతే కేక్‌ కట్‌ చేసి టీపార్టీతోనే, టిఫిన్‌తోనే లేదంటే భోజనంతోనే జరుపుకోవలసింది పోయి తాగడం, అల్లరి చేయడం, బైక్‌ రైసింగ్‌లతో ఇతరులను ఇబ్బందులకు గురిచేసే పద్దతి వారినే ఇబ్బందులకు గురిచేస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. అడ్డగోలుగా వ్యవహరించే వారి విషయంలో పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

Advertisement
Advertisement