వారే నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు | Panchayat workers' protest in Labor unions | Sakshi
Sakshi News home page

వారే నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు

Aug 13 2015 3:19 AM | Updated on Aug 14 2018 10:54 AM

వారే నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు - Sakshi

వారే నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు

‘‘కార్మిక సంఘాలు దిక్కుమాలినవా? టీఆర్‌ఎస్, కేసీఆర్ పుట్టక ముందు నుంచే కార్మిక సంఘాలున్నాయి.

దిక్కుమాలినోళ్ల ఓట్లతోనే సీఎం అయ్యావని గుర్తుంచుకో
* కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హెచ్చరిక
ఇందిరాపార్కు వద్ద పంచాయతీ కార్మికుల ధర్నా

హైదరాబాద్: ‘‘కార్మిక సంఘాలు దిక్కుమాలినవా? టీఆర్‌ఎస్, కేసీఆర్ పుట్టక ముందు నుంచే కార్మిక సంఘాలున్నాయి. అధికారం చేతిలో ఉందని కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దిక్కుమాలిన వాళ్లు వేసిన ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యావు. దిక్కుమాలిన వాళ్లే మూడున్నరేళ్ల తర్వాత నిన్ను దిక్కుమాలినవాడిని చేస్తారు’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.

దిక్కులేనివాళ్లకు దిక్కు చూపించే చుక్కలు వామపక్షాలని, దిక్కు చూపించకుండా చుక్కలు చూపుతున్న తిక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. మంత్రులు ముఖ్యమంత్రితో మాట్లాడే కనీస ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదన్నారు. తమకు ప్రజాస్వామ్య, సామాజిక, జన తెలంగాణ కావాలే తప్ప.. దోరల తెలంగాణ, నియంతృత్వ తెలంగాణ కాదని, ఇదే మాదిరిగా కేసీఆర్ వ్యవహరిస్తే.. ఆయన పాలనకు ప్రజలు పాతర వేస్తారని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మిక, ఉద్యోగ జేఏసీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు మేరకు రాజధానికి భారీగా తరలివచ్చిన కార్మికులు.. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 43 రోజులుగా సమ్మె చేస్తున్నా.. మత్తులో ఉన్నాడో, చెవుల్లో సీసం పోసుకున్నాడో సీఎంకు వినపడటంలేదన్నారు. వామపక్షాల పంచాయతీల్లో ముందు జీతాలు పెంచాలన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇస్తే తాము అక్కడే తేల్చుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయా? అని ప్రశ్నించారు. ఉద్యమ సందర్భంగా తెలంగాణ వస్తే, ఎన్నిక ల ప్రచారంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అనే మాటే ఉండదని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం పర్మినెంట్ అనే మాటే లేదంటున్నారని విమర్శించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దోరల ఆలోచనలను పుణికి పుచ్చుకున్న కేసీఆర్ సమ్మె విరమించాలని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ ధనిక రాష్ట్రంలో ప్రజలు పేదలవుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు ఉయ్యాల్లో ఊగుతోందని విమర్శించారు. పంచాయతీ కార్మికుల కనీస వేతనాన్ని రూ. 15 వేలకు పెంచడంతో పాటు వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీపీ శాసనసభపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీసీఎం శాసనసభాపక్షనేత సున్నం రాజయ్య, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క, సూర్యం (ఐఎప్‌టీయూ), నర్సింహన్ (ఏఐటీయూసీ), సాయిబాబా, పాలగుడు భాస్కర్, భూపాల్, రమ(సీఐటీయూ), జానకిరాములు(ఆర్‌ఎస్‌పీ), గోవర్ధన్, ఝాన్సీ (న్యూడెమోక్రసీ), ఎండీ గౌస్ (ఎంసీపీఐ), ఎంకే బోస్ (టీఎన్‌టీయూసీ), రాధాకష్ణ(బీఎంఎస్), మురహరి(ఎస్‌యూసీఐ) తదితరులు పాల్గొని మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement