29లోపు ‘పంచాయతీ’ రిజర్వేషన్లు

Panchayat Reservations within 29th - Sakshi

మండల స్థాయిలో కసరత్తు 

గ్రామాల వారీగా లెక్కలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంటోంది. ముఖ్యంగా పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో జిల్లా, మండల యంత్రాంగాలు నిమగ్నమయ్యాయి. రాష్ట్రస్థాయిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే స్పష్టత వచ్చిన నేపథ్యంలో మండలాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన లెక్కలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన ఫార్ములాపై జిల్లా పంచాయతీ అధికారుల (డీపీఓ)కు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈనెల 29లోగా ఈ ప్రక్రియను ముగించేందుకు జిల్లా కలెక్టర్లు, డీపీఓలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత ఏర్పడని దృష్ట్యా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా పుంజుకోవడం లేదు. జిల్లా, మండల స్థాయిల్లో రిజర్వేషన్లను ప్రకటించాక ప్రచారం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గ్రామస్థాయిల్లో బరిలో నిలిచేందుకు ఎంత మంది ముందుకు వస్తారన్నది, ఏ మేరకు పోటీ ఏర్పడుతుందనేది వేచి చూడాల్సి ఉంది.

ఏకగ్రీవాలకు ఆర్థిక చేయూత..
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏకగ్రీవ ఎన్నికలూ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎన్నిక ఏకగ్రీవమైతే మంచిదనే చర్చ కూడా కొన్ని వర్గాల్లో సాగుతోంది. గతంలో మాదిరిగానే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ఆర్థిక చేయూత కింద నిధులు అందుతాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లోనూ ఐదువేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, ఐదువేల కంటే తక్కువగా ఉన్న గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తారు.

ఈ నిధులను గ్రామీణాభివృద్ధి పనుల కోసం ఆయా పంచాయతీలు వెచ్చించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో పంచాయతీల సంఖ్య 12,751కు పెరిగింది. తక్కువ జనాభా ఉన్న గ్రామాలు, తండాలు పంచాయతీలుగా మారిన నేపథ్యంలో ఏకగ్రీవాల సంఖ్యకూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఏపీలో 2013లో పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో 8,778 పంచాయతీలున్నాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో 451 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ప్రోత్సాహం కింద ఈ పంచాయతీలకు నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగినా ప్రకటించిన మేర నిధులు కేటాయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top