వేణుగోపాలా.. ఎక్కడున్నావయ్యా?! | Sakshi
Sakshi News home page

వేణుగోపాలా.. ఎక్కడున్నావయ్యా?!

Published Mon, Jan 29 2018 4:58 PM

panchaloha statue theft in kamareddy it is a challenge to  police - Sakshi

కామారెడ్డి క్రైం: పురాతన ఆలయ గర్భగుడిలో ఉత్సవ మూర్తులుగా కొలువుదీరిన వేణుగోపాలస్వామి(శ్రీకృష్ణుడు), రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు, అందులోనూ 700 ఏళ్లనాటి ఘన చరిత్రగల దేవతామూర్తుల ప్రతిమలు, జనావాసాల మధ్య ఆలయం. నాలుగు ద్వారాలు దాటిన తర్వాతగానీ గర్భగుడిలోనికి ప్రవేశం. నాలుగు నిమిషాల్లోనే దోపిడీ జరిగిపోయింది. శనివారం సాయంత్రం కాలనీలో అందరూ ఉండగానే ఏ మాత్రం అనుమానం రాకుండా సుమారు 75 కిలోల బరువు గల పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయిన కేసు ప్రస్తుతం జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. ఇద్దరు దుండుగులు విగ్రహాలను చోరీ చేసి ఉడాయించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైంది. వారి ముఖాలు స్పష్టంగా కనిపించక, ఆలయం నుంచి బయటకు వచ్చాక కొద్ది దూరం తర్వాత ఏ దారిగుండా పారిపోయారో, ఎక్కడకు పోయారో తెలుసుకోవడంలో అడ్డంకులు పోలీసు అధికారులకు నిద్రపట్టనీయడం లేదు. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని పరిశోధనకు 10 బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. వేణుగోపాలస్వామి జాడ కోసం పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

సీసీ ఫుటేజీలో ఇద్దరు దుండగులు...  
సంఘటన జరిగిన ఆలయాన్ని ఎస్పీ శ్వేత, డీఎస్పీ ప్రసన్నరాణి, పట్టణ పోలీసులు సందర్శించి విచారణ ప్రారంభించారు. వీధి చివరలో ఉన్న సీసీ పుటేజీ పరిశీలించగా దుండగులు ఇద్దరు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6.55 గంటలకు తెలుపు రంగు షర్టు వ్యక్తి, ఆ తర్వాత నీలిరంగు షర్ట్‌ వ్యక్తి లోనికి వెళ్లారు. 6.59 గంటలకు ఇద్దరూ సంచులతో బయటకు వచ్చారు. కొద్ది దూరంలో ఉన్న బీసీ బాయ్స్‌ హాస్టల్‌ గల్లీలోకి వెళ్లిపోయారు. అక్కడ నుంచి ఎటు వెళ్లారు, ముఠాలో ఎవరైనా ఉన్నారా అనే విషయాలు తెలుసుకు నే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టణంలోని అన్ని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

4 నిమిషాల్లోనే దోచేశారు..  
దుండగులు కేవలం 4 నిమిషాల్లోనే దేవతా మూర్తుల పంచలోహ విగ్రహాలను దోచుకువెళ్లారు. ప్రధాన అర్చకుడు ధర్మకర్తల కుటుంబీకులు పక్కనే ఉంటారు. ఉద యం స్వామివారికి పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాక ఆలయ గర్భగుడికి తాళం వేసి వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత అందరూ మండపంలో నుంచి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. సాయంత్రం ఆలయంలో ఎవరూ లేకపోవడంతో తాళాన్ని శబ్ధం రాకుండా పగులగొట్టినట్లు ఆనవాళ్లున్నా యి. ప్రధాన దేవతల విగ్రహాల ముందు ఉత్సవ మూర్తులను పీటముడుల నుంచి తొలగించుకుని ఉడాయించారు.  

పంచలోహ విగ్రహాలే టార్గెట్‌..
700 ఏళ్ల చరిత్ర కలిగిన వైష్ణవ దేవాలయంగా పెద్దబజార్‌లోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం పేరుగాంచింది. కాకతీయుల కాలంనాటిది. దోమకొండ సంస్థానాధీశులు నిర్మించిన కిష్టమ్మగుడిలో ప్రస్తుతం చోరీ అయిన పంచలోహ విగ్రహాలు ఉండేవట. 200 ఏళ్ల క్రితం వాటిని కంజర్ల వంశీయులు వచ్చి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఘన చరిత్ర ఉన్న పంచలోహ విగ్రహాలు ఇక్కడ ఉన్నట్లు చాలా మందికి తెలియదు. చోరీ తీరును చూస్తే కేవలం పంచలోహ విగ్రహాలను మాత్రమే టార్గెట్‌ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆలయంలో దేవతల కిరీటాలు, శంకు చక్రాలు, పాత్రలు ఎన్నో ఉన్నా దేన్నీ ముట్టుకోలేదు. ఎంతో కాలంగా వాటిని కాజేసేందుకు బాగా తెలిసిన వారే కుట్రలు పన్ని పథకం ప్రకారం చోరీ చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చోరీలు గతంలో హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతాల్లో వెలుగుచూసినట్లు పోలీసులు చెబుతున్నారు. పంచలోహ విగ్రహాలను చోరీ చేసి ఏం చేస్తారు, ఎక్కడ విక్రయిస్తారు? అనే కోణంలో విచారిస్తున్నారు. విగ్రహాల విలువ రూ.కోటిపైగా ఉంటుందని ఆలయ ధర్మకర్తల కుటుంబీకులు చెబుతున్నారు.  

అన్ని కోణాల్లో విచారణ...
సంచలనం సృష్టించిన పంచలోహ విగ్రహాల చోరీ కేసును చేధించేందుకు జిల్లా పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో కేసు పరిశీలన, తనిఖీల నిమిత్తం పది బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆలయాల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తులను, ఇదే తరహాలో చోరీ చేసే వారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు కనిపించినా మొత్తం వ్యవహారంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రాలేదు. నిందితులను తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement