29న జిల్లాకు రాహుల్ | on 29th rahul tour to district | Sakshi
Sakshi News home page

29న జిల్లాకు రాహుల్

Jun 13 2015 2:24 AM | Updated on Aug 17 2018 6:00 PM

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ఆహ్వానం మేరకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 29వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది...

- ఉప ఎన్నికలే లక్ష్యంగా పర్యటన
- కొత్త ఉత్సాహం నింపేందుకు పీసీసీ యత్నాలు
వరంగల్ :
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ఆహ్వానం మేరకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 29వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాహుల్ గాంధీ గత నెల 12వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో చేపట్టిన ‘రైతు ఆత్మగౌరవ యాత్ర’ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు.

జూన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాకు సోనియాగాంధీని తీసుకొచ్చేందుకు పీసీసీ ప్రయత్నించింది. ముందు ఉప ఎన్నికలు తప్పవని తెలియడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ పర్యటనపై ఆసక్తి కనబర్చలేదు. ఉపఎన్నికలు ఖరారైతే రాహుల్ జిల్లాలో పర్యటించేందుకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

జవసత్వాలు నింపేందుకు..
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ పార్లమెంట్‌తోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తున్న అంశం.

పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పార్టీ కేడర్‌కు జవసత్వాలు సమకూర్చేందుకు పీసీసీ నాయకత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క జిల్లాలు పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ పార్టీ కార్యకర్తలో నూతనోత్సాహం నింపుతున్నారు. ఈ మేరకు జూన్ ఆఖరి వారంలో రెండు రాష్ట్రాల్లో రాహుల్ పర్యటన దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా జిల్లాలో 29వ తేదీన రాహుల్ వస్తారని సమాచారం అందినట్లు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement