మేకలమ్మగుట్టపై దిగంబర విగ్రహాలు

Old Statues In Mekala Gutta - Sakshi

రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు గ్రామంలో ఉన్న మేకలమ్మ గుట్టపై దంపతుల దిగంబర విగ్రహాలు వెలుగు చూశాయి. జనగామ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి బుధవారం తాజాగా వీటిని గుర్తించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టపై కనిపించిన స్త్రీ, పురుష దిగంబర విగ్రహాలను మేకలయ్య, మేకలమ్మగా భావిస్తున్నారు.

10 శతాబ్దానికి చెందిన ఈ దంపతుల శిల్పాలు విడివిడిగా అడుగున్నర ఎత్తులో ఉన్నాయి. ఎలాంటి ఆయుధాలు, జంతువుల చిహ్నాలు లేకపోవడంతో వారు ఏ దేవతామూర్తులే చెప్పలేకపోతున్నారు. మేకలమ్మ శిల్పం మూడు ముక్కలుగా ఉండగా మధ్య భాగం కనిపించడం లేదు. ఇక్కడ రాతితో నిర్మించిన మేకలమ్మ గుడిని దశాబ్దాల క్రితం కూల్చి వేయడంతో పూర్తిగా మాయమైంది. గుడికి ఉన్న మాన్యం భూములు అన్యాక్రాంతం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ జాతర జరిగేదని, రెండు దశాబ్దాలుగా అటు వైపు వెళ్లే వారు లేరని తెలుస్తోంది.    

అరుదైన డోల్మన్‌ సమాధులు..

గుట్టకు తూర్పు వైపున అనేక బండలున్నాయి. అక్కడ సముద్ర మట్టానికి 1,565 అడుగుల ఎత్తులో అనేక డోల్మన్‌ సమాధులను నిర్మించారు. మేకలమ్మ గుడికి 100 అడుగుల దూరంలో మూడు మీటర్ల పొడవైన రెండు రాతి పలకలు, అడుగున్నర పొడవులో ఉన్న పలకలను స్వస్తిక్‌ ఆకారంలో అమర్చారు. ఈ నాలుగింటి మధ్య మూడు నుంచి నాలుగు అడుగుల ఖాళీ స్థలాన్ని వదిలి పై భాగాన కప్పు బండ బోర్లించారు.

ఇటువంటి నిర్మాణాలు చాలు అరుదుగా ఉంటాయి. చుట్టు పక్కల ఉన్న అనేక డోల్మన్‌ సమాధులను కూల్చివేశారు. గుట్ట కింద ఉన్న కుంటల్లో వందల సంఖ్యలో పెలికాన్‌ కొంగలు వచ్చి సేదతీరుతున్నాయి. మేకలమ్మ గుట్టను పురావస్తుశాఖ అధికారులు సందర్శిస్తే మరెంతో చరిత్ర వెలుగులోకి రానుంది. ఖిలాషాపూర్‌ సర్వాయి పాపన్న కోట సమీపంలోని ఈ గుట్టపై మేకలమ్మ ఆలయం నిర్మిస్తే పర్యాటక ప్రాంతం కావడంతోపాటు డోల్మన్‌ సమాధులు రక్షించబడతాయి.

సమగ్రంగా పరిశోధించాలి

జిల్లాలో ఎక్కడా లేని విధంగా మేకలమ్మ గుట్టపై దిగంబర విగ్రహాలు వెలుగుచూశాయి. ఎంతో ఘన చరిత్ర గల ఈ విగ్రహాలపై పురావస్తుశాఖ సమగ్రంగా పరిశోధించాలి. ఇక్కడి విగ్రహాలను మ్యూజియానికి తరలిస్తే గ్రామ చరిత్రకున్న ప్రాధాన్యం పోతుంది. మేకలమ్మ గుట్టను పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని ఆలయాన్ని పునరుద్ధరించాలి. డోల్మన్‌ సమాధులు, శిల్పాలను రక్షించడంతోపాటు ఎకో టూరిజం కింద మేకలమ్మ గుట్టను అభివృద్ధి చేయాలి.

- రత్నాకర్‌రెడ్డి,ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top