పార్టీ విధానాలు ప్రజల్లోకి..!

Observation of Left parties on Competition in Lok Sabha elections - Sakshi

కేడర్‌లో నూతనోత్సాహానికి కలిసొచ్చిన ఎన్నికలు 

ప్రభుత్వ విధానాలను ఎండగట్టగలిగామన్న సంతృప్తి 

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై వామపక్షాల పరిశీలన 

సాక్షి, హైదరాబాద్‌: ఉభయ కమ్యూనిస్టుపార్టీలు తాము పోటీ చేసిన నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారా న్ని బాగానే నిర్వహించగలిగామనే అభిప్రాయంతో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమ తమ పార్టీల రాజకీయవిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వాల అప్రజాస్వామిక విధానాలు, వైఖరిని ఎండగట్టగలిగామని భావిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపి, మళ్లీ సంస్థాగతంగా పార్టీల పటిష్టతపై దృష్టి పెట్టేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడ్డాయని అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం లో రెండుపార్టీల నేతలు, కార్యకర్తలు చురుకుగా భాగస్వాములు కావడం ద్వారా కేడర్‌లో నూతనోత్తేజం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   కేరళలోని వయనాడ్‌ నుంచి సీపీఐ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తుండడంతో ఆ పార్టీపై వామపక్షాలు అనుసరించే ధోరణి, వైఖరిలో కొంతమార్పు వచ్చింది.  

సీపీఐ, సీపీఎంల 4 సీట్లలో పరిస్థితి 
ఖమ్మం లోక్‌సభ: ఖమ్మం సీపీఎం అభ్యర్థిగా బి.వెంకట్‌ పోటీ చే శారు. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఉండడంతో గెలుపుపై ఏమాత్రం అంచనాలు లేవు. సీపీఎం అభిమానులతోపాటు వామపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్లు పడతాయనే ఆశాభావంతో ఉన్నారు.  

నల్లగొండ లోక్‌సభ: టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ నెలకొనడంతో సీపీఎం ఇక్కడ గెలుపుపై పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు. మల్లు లక్ష్మీని పోటీకి దింపడం ద్వారా ఇతరవర్గాల ఓట్లతోపాటు కొంతమేర మహిళల ఓట్లు కూడా సాధించే అవకాశాలు న్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలను పార్టీవిధానాల ప్రచారంతోపాటు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కల్పించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 

భువనగిరి లోక్‌సభ: ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మునుగోడు, నకిరేకల్‌లలో వామపక్షాలకు కొంత మద్దతు ఉంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ నేపథ్యంలో  సీపీఐ అభ్యర్థిగా గోదా శ్రీరాములు పడే ఓట్లు తక్కువగానే ఉండొ చ్చని అంచనా వేస్తున్నారు. సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిని పోటీకి నిలిపి ఉంటే పరిస్థితి  మెరుగ్గా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మహబూబాబాద్‌ లోక్‌సభ: సీపీఐ అభ్యర్థిగా కల్లూరి వెంకటేశ్వర్‌రావు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో పార్టీపరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ చేతులెత్తేయడం తో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు ఖాయమైనట్టుగా వామపక్షపార్టీల నాయకులు అంచనా వేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top