
అభిప్రాయం
కొద్ది దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పార్టీలకు గ్రహణం పట్టింది. వాటి ప్రాభవం గణనీయంగా తగ్గింది. దేశంలోని అనేక చోట్ల ప్రజానీకానికి కమ్యూనిస్టు పార్టీ అంటే ఏమిటో తెలియని స్థితి నెలకొంది. కమ్యూనిస్టు పార్టీలు ‘కాలం చెల్లిన’ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతుండటమే దీనికి కారణం అనేవారు మొదలు కొని... అసలు కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, తాము కూడా, తాము నిత్యం విమర్శించే బూర్జువా పార్టీల లాగే తయారవ్వడం వల్లనే, వాటికి ఈ పరిస్థితి దాపురించిందని రకరకాల విమర్శలు ఉన్నాయి.
పునాది లేకుండా పోయింది!
కమ్యూనిస్టు పార్టీల అస్తిత్వానికీ, మనుగడకూ అనివార్యం అయిన ప్రాథ మిక పునాదులు నేటి సమాజంలో లేకుండా పోయాయన్నది గమనార్హం. కమ్యూనిస్టు పార్టీల అస్తిత్వానికి పునాది – వర్గ పోరాటాలు. కార్మికులు, యజమానులు అనే పరస్పరాభిముఖాలైన రెండు వర్గాలు ఉండటం, వారి మధ్యన పెట్టుబడి, శ్రమల ద్వారా సృష్టించబడిన సంపద తాలూకు పంపిణీలో ఏర్పడే ఘర్షణలు... ఇదీ సూక్ష్మంగా కమ్యూనిజానికీ, కమ్యూనిస్టు పార్టీలకూ ఆస్కారం కల్పించే నేపథ్యం.
ఒక పారిశ్రామిక సంస్థలోనో, సేవారంగపు కార్యాలయంలోనో శారీరక లేదా మేధాశ్రమతో సృష్టించబడిన సంపదలోని సింహభాగాన్ని ఆ సంస్థ యజమాని నొల్లుకోవడం, పెట్టుబడిదారీ వ్యవస్థలో సహజంగా జరిగే పరిణామం. అంటే, పరిశ్రమలో ఒక కార్మికుడు 8 గంటల పాటు శ్రమ చేయడం ద్వారా సృష్టించిన సంపదలోని కొంత వాటాను మాత్రమే (ఉదాహరణకు: 4 గంటల శ్రమ ఫలితం మేరన మాత్రమే) కార్మికుడికి వేతనంగా ఇచ్చి, మిగతా శ్రమ ఫలితాన్ని (దీనినే ‘అదనపు విలువ’ అని పిలుస్తారు) యజమాని సొంతం చేసుకోవడమే కమ్యూనిజం చెప్పే శ్రమ దోపిడీ సారాంశం! తన శ్రమ ఫలితాన్ని కొల్లగొడుతూ రోజు రోజుకూ మరింత ధనవంతుడవుతోన్న యజమాని పట్ల కార్మికులకు సహజంగానే ద్వేషభావం ఏర్పడుతుంది. ఈ ద్వేష భావమే వర్గ పోరాటాలకు ప్రేరణ. వర్గ రహిత సమాజ ఆలోచనకు చోదక శక్తి.
కొన్ని దశాబ్దాలుగా ఈ పెట్టుబడిదారీ పునాది లోనే మార్పు వచ్చింది. పారిశ్రామిక, సేవా రంగాల ఉత్పాదక శ్రమ... తద్వారా సంపద సృష్టి స్థానంలో ఎటువంటి ఉత్పత్తికీ స్థానం లేని ఫైనాన్స్ పెట్టుబడుల యుగం నేడు ప్రధాన స్రవంతిగా నడుస్తోంది. ఈ ఫైనాన్స్ ఆధారిత రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లలో... ఉత్పత్తి రంగాలలో చూసే శ్రమ దోపిడీ, అదనపు విలువ వంటివి కనపడవు. అంటే, యజమాని–కార్మి కుడి సంబంధాలు... దాని ఫలితంగా ఏర్పడే దోపిడీ భావన... వర్గ పోరాటాలు... ఈ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటి స్పెక్యులేటివ్ రంగాలలో పాత్ర పోషించవు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇక్కడ వర్గ పోరాటానికి చోదక శక్తిగా ఉండే వర్గాల మధ్య ద్వేష భావనకు స్థానం లేకుండా పోయింది.
దాని స్థానంలో ఫైనాన్స్ పెట్టుబడుల ఈజీ మనీ యుగం పేదలు, ధనికుల మధ్య పోల్చి చూసుకోవడాన్నీ, ఈర్ష్యనూ తెచ్చి పెట్టింది. అంటే, నేటి ఈ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ ఆధిపత్య యుగంలో – పేదలు (‘శ్రామి కులు’) ధనికులతో పోల్చి చూసుకుంటున్నారు. ఈ యుగం లక్షణం వర్గ పోరాటం ద్వారా హక్కుల సాధనో, సోషలిజం నిర్మాణమో కాదు. ధనవంతుడిని అనుకరించడం, అతని నమూనాని ఆరాధించడం, ఎలాగైనా తాను కూడా ఆ స్థానాన్ని చేరుకోవడం!
ఈ క్రమంలోనే వర్గ పోరాటాలు, సోషలిజం లక్ష్యంగా గల కమ్యూనిస్టు ఉద్యమాలకు గ్రహణం పట్టింది. దీనితో పాటుగా తెలుగు రాష్ట్రాలలో వచ్చిన సాఫ్ట్‌వేర్ రంగ ‘విప్లవ’ ఫలితంగా మన యువతీ యువకులకు అమెరికా ఒక అంతిమ డెస్టినేషన్ గా మారింది. మన పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాలు అమెరికా డాలర్ల ప్రవాహంలో మునిగి తేలుతున్నాయి. ఫలితంగా, కమ్యూనిస్టు సిద్ధాంతానికి గుండెకాయ వంటి సామ్రాజ్య వాద వ్యతిరేక భావన అంతరించింది. మొత్తంగా మధ్యతరగతి వర్గం, నయా మధ్యతరగతి వర్గాలకు కమ్యూనిజం అనేది ఒక ఉబుసుపోని కబురుగా మిగిలిపోయింది. తమ తల్లిదండ్రులు, తాత ముత్తాతల పాత కాలం వాసనగా తయారయ్యింది. అదీ విషయం!
మళ్లీ తెర లేస్తోంది!
ఇదే క్రమంలో సోవియట్ పతనం కూడా దీనికి అదనపు జోడింపై, ఉన్న కాస్తపాటి కమ్యూనిస్టు పార్టీలలో కూడా నైతిక శక్తి, సైద్ధాంతిక బలం నిర్జీవం అయిపోయి రంగు, రుచి, వాసనలను కోల్పో యాయి. ఫలితంగా అవి ఏ సైద్ధాంతిక నిబద్ధతా లేని కొద్దిపాటి మంది అవకాశవాద నాయకుల సమూ హంగానో, లేకుంటే మరేం చెయ్యాలో తెలియక ఎర్ర జెండా కప్పించుకొని చనిపోతే చాలు అనుకునే దుర్భల మనఃస్థితిలో జీవిస్తోన్న మానసిక దౌర్బల్యపరులతోనో నిండిపోయాయి.
ఇక్కడ గమనించవలసినది 3, 4 దశాబ్దాల గ్రహణ కాలం నేడు అంతిమ దశకు చేరింది. ఫైనాన్స్ పెట్టుబడుల యుగం దాని చరమాంకానికి చేరుతోంది. పెట్టుబడిదారీ దేశాలు మరెంత మాత్రమూ, మరింతగా కరెన్సీలను ముద్రించి వ్యవస్థలను కాపాడుకొనే అవకాశం లేకుండా పోతోంది. నిరంతరంగా ముద్రించబడిన డబ్బుల ప్రవాహం వలన ఏర్పడిన రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ బుడగలు బద్దలైపోతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగానే రియల్ ఎస్టేట్ రంగం పతనం, షేర్ మార్కెట్లలో సంక్షోభాలు నేటి సర్వసాధారణ లక్షణాలుగా ఉన్నాయి. ఆర్థిక మాంద్య వాతావరణం ప్రపంచాన్ని కమ్ముకుంటోంది. దీనినంతటినీ మించి ఈ 3, 4 దశాబ్దాల ఫైనాన్స్ వికృత క్రీడకు కేంద్రబిందువయిన అమెరికా పెట్టుబడి దారీ వ్యవస్థ నేడు సంక్షోభాలతో సతమతమవుతోంది. కథ కొలిక్కి వస్తోంది.
ఫైనాన్స్ యుగం గ్రహణం వీడి, పేద–ధనిక వర్గ పోరాటాల యుగానికి నేడు మరలా వేగంగా తెర లేస్తోంది. డాలర్ డ్రీమ్స్ ముగింపులో మరో కొత్త బంగారు లోకం తాలూకు లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టన్నెల్ మిలమిలా మెరుస్తూ కనబడుతోంది. ఈసారి ఈ గ్రేట్ మార్చ్ ప్రపంచాన్ని సోషలిస్ట్ మహా యుగం దిశగా నడిపించబోతోంది. వింటున్నారా కామ్రేడ్స్! మేం మళ్ళీ వస్తామన్న మాట నిలబెట్టు కోవడం ఇక మీ వంతు. లాల్ సలామ్!
డి. పాపారావు
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు ‘ 98661 79615