నామినేషన్ల స్వీకరణకు వేళాయే

Nominations Starts For Sarpanch Elections - Sakshi

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నేటి నుంచి 9వరకు నామినేషన్ల స్వీకరణ 

గ్రామాల్లో వేడెక్కిన ఎన్నికల సమరం  

బెల్లంపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఇతర సిబ్బందిని నియామించారు.  ఉదయం 10:30 గంటల నుంచి మధ్యా హ్నం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికా రి అభ్యర్థుల నుంచి ఈనెల 7నుంచి 9వరకు  నా మినేషన్లను స్వీకరిస్తారు. మూడు రోజుల పాటు మాత్రమే నామినేషన్లను అందజేయాల్సి ఉంటుంది. అందజేసిన నామినేషన్‌ పత్రాలను 10న పరిశీలిస్తారు. 

ఈనెల 13వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు విత్‌ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేరోజు బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనేది రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు.  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచార పర్వాన్ని నిర్వహించడానికి  అవకాశం కల్పిస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో  ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల సమరం క్రమంగా దగ్గర పడడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈనెల 21న  గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.  అదే రోజు సాయంత్రం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. మంచిర్యాల జిల్లాలో తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో చకచక  ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాజకీయ పార్టీలకు అతీతంగా..
గ్రామ పంచాయతీ ఎన్నికలను రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఆచరణలో మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన చోటా, మోటా నాయకులు పోటీకి సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపికను స్వయంగా ప్రధాన పక్షాల అధినాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడమే ప్రధాన లక్ష్యంగా అభ్యర్థులను బరిలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీల గుర్తులు ఉండవు. ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తులను మాత్రమే కేటాయిస్తారు. రాజకీయ పార్టీల కనుసన్నల్లో అభ్యర్థులు పల్లె సమరానికి సిద్ధమవుతున్నారు.  ఇప్పటికే ఓటర్లను మ చ్చిక చేసుకునేందుకు సమావేశాలు, విందులను ఏర్పాటు చేస్తున్నారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో..
అసెంబ్లీ నియోజకవర్గంలో 114  గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, భీమిని, నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి మండలాలు ఉండగా ఆయా మండలాల పరిధిలో ఇదివరలో 67 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా లంబాడీ తండాలను, 500 జనాభా దాటి ,3 కిలో మీటర్ల దూరం ఉన్న గ్రామాలను వేరుచేసి నూతనంగా మరో 47  గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top