నిధుల్లేవ్‌.. పనుల్లేవ్‌!

No Funds For Mlas in State Budget - Sakshi

ఎమ్మెల్యేలకు సమస్యల స్వాగతం  

అభివృద్ధి పనులకు నిధులు లేక సతమతం

విడుదల కాని సీడీపీ నిధులు  

అసంతృప్తిలో స్థానిక ప్రజాప్రతినిధులు   

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: ఏ ఊరికి, బస్తీకి వెళ్లినా ఎమ్మెల్యేలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జనం పరిష్కారం కోసం పట్టుబడుతుండడంతో ఏం చేయాలో తెలియక ప్రజాప్రతినిధులు తల పట్టుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీపీ)తో పల్లెల్లో ప్రగతి బాటలు వేద్దామనుకున్న ఎమ్మెల్యేల కలలు కల్లలుగానే మిగిలాయి. ఎమ్మెల్యేలకు ఏటా రూ.3 కోట్ల సీడీపీ నిధులు రావాల్సి ఉండగా... అవి ఎప్పుడు విడుదలవుతాయన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి మూడు నెలలకు రూ.75 లక్షలు విడుదల కావాల్సి ఉన్నా... ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికే మూడు త్రైమాసికాలు పూర్తి కావస్తున్నాయి. దీంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకపోవడంతో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనులు చేపట్టలేకపోతున్నామని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేల ఎదుట వాపోతున్నారు. 

ఐదేళ్లకు రూ.15 కోట్లు  
ప్రతి ఎమ్మెల్యేకు ఏటా రూ.3 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.15 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ సీడీపీ నిధులను ఏడాదిలో ఒక పర్యాయం కాకుండా... మూడు నెలలు లేదా ఆరు నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది. ఈ  నిధులను నియోజకవర్గాల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రేటర్‌లో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు.. మలక్‌పేట్, చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహదూర్‌పురా, నాంపల్లి, గోషామహాల్, సికింద్రాబాద్, అంబర్‌పేట్, జుబ్లీహిల్స్, ముషీరాబాద్, కంట్మోనెంట్, ఖైరతాబాద్, సనత్‌నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా), పటాన్‌చెరు(సంగారెడ్డి) ఉన్నాయి. ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కొత్త, పాత ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మాదిరి సీడీపీ నిధులను మూడు నెలలకు ఒక పర్యాయం చొప్పున విడుదల చేసినా... ఇప్పటి వరకు రెండు పర్యాయాలకు సంబంధించిన నిధులు రావాల్సి ఉంది. ఈ లెక్కన ప్రతి ఎమ్మెల్యేకు రూ.1.50 కోట్ల చొప్పున 24 మంది ఎమ్మెల్యేలకు రూ.36 కోట్లు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నయా పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలుపటానికి ఎమ్మెల్యేలు నెల రోజుల పాటు తమ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, గ్రామల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేలకు విన్నవించారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు వారికి హామీలిచ్చారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో రెండోసారి తమ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలను కలిసేందుకు ఎమ్మెల్యేలు జంకుతున్నారు. ఎన్నికల్లో తమకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం నిధులు లేకపోవడంతో వారికి కూడా ముఖం చూపించలేక ఎమ్మెల్యేలు చాటేస్తున్నారు.

పెండింగ్‌లో పనులు... 
సీడీపీ నిధులు విడుదల కాక ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుండగా... మాజీ ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలకు కేటాయించిన సీడీపీ నిధుల్లో 30 శాతం అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తి కావడానికి మరో రెండు నెలలు పట్టవచ్చునని సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top