మూలకణ మార్పిడితో ఇద్దరికి పునర్జన్మ

NIMS doctors saved two lives by Stem cell transplant - Sakshi

ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ కింద ఉచితంగా నిమ్స్‌ వైద్యుల చికిత్స

సాక్షి, హైదరాబాద్‌: మూలకణ మార్పిడి చికిత్సతో ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించారు నిమ్స్‌ వైద్యులు. ఖరీదైన ఈ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ జాబితాలో చేర్చి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని వి.లక్ష్మీప్రసన్న(21) కొంతకాలంగా రక్తసంబంధ సమస్యతో బాధపడుతోంది. చికిత్స కోసం 8 నెలల క్రితం ఆమె నిమ్స్‌ హెమటాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఏఎంవీఆర్‌ నరేందర్‌ను సంప్రదించింది. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎంఎస్సీ విద్యార్థి రామకృష్ణ(26) కూడా నిమ్స్‌కు వచ్చాడు. వైద్య పరీక్షల్లో వీరిద్దరూ ఎప్లాస్టిక్‌ ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మూలకణాల మార్పిడి చికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. మూలకణాలను దానం చేసేందుకు బాధితుల సోదరులు ముందుకు రావడంతో వారి నుంచి కణాలు సేకరించారు. ప్రాసెస్‌ చేసిన తర్వాత బాధితులకు ఎక్కించారు. సాధారణంగా ఇలాంటి చికిత్సకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలకుపైగా ఖర్చవుతుంది. నిమ్స్‌లో 2008 నుంచే మూలకణాల మార్పిడి చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకు 120 చికిత్సలు చేశారు. అయితే ఆయా వైద్య ఖర్చులను రోగులే భరించాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు చికిత్సకు నోచుకోలేక మృత్యువాతపడుతుండటంతో హెమటాలజీ, మెడికల్‌ ఆంకాలజీ వైద్యుల సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఖరీదైన ఈ సేవలను ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ పథకాల్లో చేర్చింది. దీనిలో భాగంగా రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లిస్తోంది. లక్ష్మీప్రసన్నకు ఈహెచ్‌ఎస్‌ స్కీమ్‌ కింద, రామకృష్ణకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించినట్లు డాక్టర్‌ నరేందర్‌ స్పష్టం చేశారు. నిమ్స్‌ ఆస్పత్రిలో ఈ తరహా చికిత్సలు ఉచితంగా చేయడం ఇదే ప్రథమమని ఆయన వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top