బీపీ, షుగర్‌ రోగులకు ఐడీ నంబర్‌ | Sakshi
Sakshi News home page

బీపీ, షుగర్‌ రోగులకు ఐడీ నంబర్‌

Published Sat, Dec 14 2019 3:11 AM

NHM Has Decided To Allocate Unique ID For BP And Sugar Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు యూనిక్‌ ఐడీ నంబర్‌ కేటాయించాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్‌తో కూడిన బుక్‌ అందజేస్తారు. ఈ బుక్‌లో యూనిక్‌ ఐడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) కోడ్, జిల్లా, గ్రామం కోడ్స్‌ ఉంటాయి. ఇప్పటికే బుక్స్‌ సిద్ధం కాగా, త్వరలోనే పంపిణీ చేయనున్నారు. యూనిక్‌ ఐడీ నంబర్ల వినియోగంపై ప్రస్తుతం ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో రోగికి ఒక్కో బుక్‌ ఇచ్చి, అందులోని యూనిక్‌ ఐడీ నంబర్‌తో రోగుల వివరాలను అనుసంధానించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వారికి అందిస్తున్న వైద్యం, ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు, ఇతర విషయాలు బుక్‌లోనూ, ఆన్‌లైన్‌లో నమో దుచేస్తారు. దీంతో వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఏదైనా చికిత్స కోసం వెళితే ఈ యూనిక్‌ ఐడీ నంబర్‌ ఆధారంగా డాక్టర్లు వైద్యం చేసే అవకాశముంది. 

5.14 లక్షల మందికి నంబర్లు.. 
రాష్ట్రంలో సిద్దిపేట, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నాన్‌–కమ్యూనికబుల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ) సర్వే పూర్తయింది. ఈ జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన 35 లక్షల మందికి బీపీ, షుగర్‌ పరీక్షలు చేయించారు. ఇందులో 2.14 లక్షల మందికి డయాబెటిస్, సుమారు 3 లక్షల మందికి బీపీ ఉన్నట్టు గుర్తించారు. తమకు షుగర్, బీపీ ఉందని వీరిలో సుమారు 50 శాతం మందికి సర్వే నిర్వహించే వరకూ తెలియదు. మిగిలిన జిల్లాల్లో సర్వే కొనసాగుతోంది. క్షేత్రస్థాయి ఆరో గ్య కార్యకర్తలు గుర్తించిన అనుమానిత కేసులకు పీహెచ్‌సీ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంది. సర్వే పూర్తైన 12 జిల్లాల్లో మరోసారి సర్వే చేయనున్నట్టు చెబుతున్నారు. తొలి దశలో కొన్ని చోట్ల పాత పేషెంట్ల వివరాలు నమోదు చేయలేదు. వీరికి కూడా యూనిక్‌ ఐడీ నంబర్‌ ఇస్తారు.
 
త్వరలో అందరి హెల్త్‌ ప్రొఫైల్‌.. 
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నియోజకవర్గంలో హెల్త్‌ ప్రొఫైల్‌పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెల్త్‌ ప్రొఫైల్‌ చేపట్టే అంశంపై అధికారులకు ఆదేశాలు రానున్నాయి. ముందుగా సీఎం నియోజకవర్గం నుంచి ప్రారంభించి దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు.మొత్తం వైద్య ఆరోగ్య శాఖతోపాటు హెల్త్‌ ప్రొఫైల్‌పై ముఖ్యమంత్రి త్వరలో సమీక్ష చేసే అవకాశముంది.   

Advertisement
Advertisement