న్యూ ఇయర్‌ స్పెషల్‌ బార్లు..బార్లా!

New year Josh in Greater Hyderabad city - Sakshi

నూతన సంవత్సర వేడుకలకు భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో 134 పార్టీలకు అనుమతులు

మరో 542 బార్లు, పబ్బుల్లో ఏరులై పారనున్న మద్యం

రహదారులపై ట్రాఫిక్‌ మళ్లింపు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో కొత్త సంవత్సర జోష్‌ మొదలైంది. వేడుకల కోసం ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఇప్పటికే 134 పార్టీలకు పోలీసు, ఆబ్కారీశాఖ అనుమతులు ఇచ్చాయి. ఈ ఈవెంట్లు మాత్రమే కాకుండా హైదరాబాద్‌వ్యాప్తంగా 542 బార్లు, పబ్బులు, పెద్దసంఖ్యలో ఉన్న క్లబ్బులు, రిసార్టుల్లో మద్యం పొంగిపొర్లనుంది. గత వేడుకలకు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈసారి రూ.120 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్‌ శాఖ అధికారుల అంచనా.

ఇటీవల మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో.. అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. నగరంలోని మద్యం దుకాణాలు, బార్లు ఇప్పటికే అదనంగా మద్యం ఆర్డర్లు ఇచ్చాయని.. లిక్కర్‌ డిపోల్లోనూ ఫుల్లుగా స్టాకు ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు మద్యం తాగి రహదారులపై దూసుకెళ్లే వాహనదారులకు కళ్లెం వేసేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేపట్టింది. పార్టీలు, ఈవెంట్లలో డ్రగ్స్‌ వినియోగంపైనా నిఘా పెడుతోంది.     – సాక్షి, హైదరాబాద్‌

రాత్రి ఒంటిగంట వరకు బార్లు, పబ్‌లు బార్లా..!
నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహించాలని పోలీసు, ఆబ్కారీ శాఖలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో రాత్రి 12 గంటల వరకు మాత్రమే పార్టీల నిర్వహణకు అనుమతి ఉంది. నూతన సంవత్సర వేడుకలు కావడంతో మరో గంటపాటు మినహాయింపునిచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఎక్సైజ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

మందుబాబులకు ఓలా బంపర్‌ ఆఫర్‌!
బార్లు, పబ్‌లు, నూతన సంవత్సర పార్టీలో పీకలదాకా తాగిన మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ప్రముఖ క్యాబ్‌ సంస్థ ఓలా ఆఫర్లు ప్రకటించింది. ‘ఏపీఐ ఇంటిగ్రేషన్‌–మిషన్‌ స్మార్ట్‌రైడ్‌ పథకం’లో భాగంగా రూపొందించిన ‘స్మార్ట్‌ వెయిటర్‌ యాప్‌’నుంచి యూజర్లు నేరుగా ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకునే ఏర్పాటు చేసింది.

ఆయా బార్లు, పబ్బుల్లో పార్టీ నిర్వాహకుల సహకారంతో క్యాబ్‌ను బుక్‌ చేసుకోవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. అధికంగా మద్యం తాగి డ్రైవింగ్‌ చేయడాన్ని నిరోధించడంతోపాటు క్షేమంగా ఇంటికి చేరుకునేలా చర్యలు చేపట్టామని తెలిపింది. ప్రత్యేక రాయితీలు, కూపన్లను కూడా అందజేస్తున్నట్లు పేర్కొంది.

శ్రుతి మించితే అరదండాలే!
కొత్త సంవత్సర వేడుకల్లో యువత శ్రుతి మించకుండా పోలీస్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీల్లో మద్యం తాగి రహదారులపైకి దూసుకొచ్చే వాహనదారులను కట్టడి చేసేందుకు.. రాత్రి ఒంటి గంట తరవాత బహిరంగ ప్రదేశాలు, నివాస జోన్ల పరిధిలో డీజేల హోరును నియంత్రించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 50 బృందాలు, సైబరాబాద్‌ పరిధిలో 120 ప్రత్యేక బృందాలను గురువారం రాత్రి నుంచే రంగంలోకి దింపారు.

ఇక కొత్త సంవత్సర వేడుకలు జరిగే ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్‌లపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించనున్నారు. ఇదే సమయంలో నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేని, కింద రైల్వేట్రాక్స్‌ ఉన్న బేగంపేట, డబీర్‌పుర, సనత్‌నగర్‌ వంటి ఫ్లైఓవర్లపై మాత్రమే రాకపోకలు ఉంటాయి.

భారీ వాహనాల రాకపోకలను నిషేధించనున్నారు. ఇక ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైనా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వారిని టికెట్‌ ఉంటేనే అనుమతిస్తారు. ఇక కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగించేవారిని గుర్తించేందుకు పోలీసు, ఆబ్కారీశాఖలు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించాయి. పార్టీలు జరిగే ప్రాంతాలతోపాటు అన్ని బార్లపై దృష్టి సారించాయి.

ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎక్సైజ్‌ అధికారులతో కలసి 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నాం. వారు సాధారణ దుస్తుల్లో పబ్బులు, బార్లలో సంచరిస్తూ.. మైనర్ల కదలికలు, వారికి మద్యం సరఫరాపై నిఘా పెడతారు. విస్తృత డ్రంకెన్‌ డ్రైవ్‌లు చేపడుతున్నాం..        – వీవీ శ్రీనివాసరావు, హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌

మద్యం తాగి వాహనాలు నడపొద్దు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు, ప్రమాదాలు జరగకుండా ప్రజలంతా పోలీసులకు సహకరించాలి. మద్యం తాగి నడిపితే వాహనాలను సీజ్‌ చేస్తాం. బార్‌లు, పబ్బులు, వైన్‌షాపులను సమయానికి మించి కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..      – సందీప్‌ శాండిల్య, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top