పేద మహిళలకు కానుక ‘ఉజ్వల’

New scheme for womans  - Sakshi

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

సూర్యాపేటలో ఉజ్వల యోజనను ప్రారంభించిన మంత్రి  

పథకం కింద రాష్ట్రానికి 20 లక్షల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు

ఈనెల 20 నుంచి దేశ వ్యాప్తంగా 15 వేల గ్రామాల్లో ఉజ్వల మేళా  

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: పొగ రహిత దేశాన్ని చూడాలన్నదే ప్రధాన మంత్రి మోదీ లక్ష్యమని, ఇందుకోసం పేద మహిళలు వంటగదిలో ఇబ్బందులు పడకుండా వారికి కానుకగా ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన  ఉజ్వల యోజనను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. అలాగే దళితులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.

అనంతరం ఎస్వీ కాలేజి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంబేడ్కర్‌ జయంతి రోజు రాష్ట్రంలో ఉజ్వల పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా కట్టనవస రం లేకుండా పేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ అందిస్తామన్నారు. రాష్ట్రంలోని మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, కోమురం భీం జిల్లాల్లో ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, ఈ జిల్లాల్లో 40 శాతం కటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు లేవని అన్నారు.

రాష్ట్రంలో 20 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు లేవని, వీరందరికీ ఈ పథకం కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నెల 20న దేశ వ్యాప్తంగా 15 వేల పైచి లుకు గ్రామాల్లో ఉజ్వల మేళా నిర్వహిస్తున్నామని, గ్యాస్‌ కనెక్షన్‌ కోసం పేదలు ఈ మేళాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఉజ్వల్‌ పథకంతో రాష్ట్రంలో గ్యాస్‌ కనెక్షన్లు పెరుగుతుండటంతో పంపిణీకి సమస్య లేకుండా డిస్ట్రిబ్యూటర్లను కూడా పెంచుతున్నట్లు తెలిపారు.
 
రాష్ట్రంలో 73 పొగ రహిత గ్రామాలు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ నాటికి రాష్ట్రంలో 73 గ్రామాలను పొగ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దనున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని, నిరుద్యోగ భృతి కింద యువతకు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇస్తామని చెప్పారు.

అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సభలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చింతా సాంబమూర్తి, నేతలు ప్రేమేందర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, జాయింట్‌ కలెక్టర్‌ సంజీవరెడ్డి, ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top