
కొత్త మునిసిపాలిటీల్లో 1 నుంచి ఆస్తిపన్ను మోత
వచ్చే నెల 1 నుంచి కొత్త నగర పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను మోత మోగనుంది.
కొత్త మునిసిపాలిటీల్లో తొలిసారిగా సవరణ
గణనలో భారీగా లోపాలుండే అవకాశం
అభ్యంతరాలకు నెల రోజుల గడువు
ఆ తర్వాత నిర్దేశించిన పన్నులు చెల్లించాల్సిందే
హైదరాబాద్: వచ్చే నెల 1 నుంచి కొత్త నగర పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను మోత మోగనుంది. నివాస భవనాలపై సగటున రెండింతలు, వాణిజ్య భవనాలపై మూడింతలకు పైగా పన్నులు పెరగనున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు పెరిగిన పన్నుల వివరాలను సంబంధిత చెల్లింపుదారులకు తెలుపుతూ పురపాలికలు వచ్చే నెల 1 నుంచి ప్రత్యేక డిమాండు నోటీసులు జారీ చేయనున్నాయి. ఈ నోటీసుల్లో ప్రకటించిన ఆస్తి పన్నులపై అభ్యంతరాలు ఉంటే నెల రోజుల వ్యవధిలో అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలి. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని, నిర్దేశించిన మేరకు పన్నులు చెల్లించక తప్పదని రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 27 నగర పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నుల పెంపు 2015-16 నుంచి అమలులోకి రానుంది. వచ్చే నెల 1 నుంచి పెంపు అమలులోకి రానున్న నేపథ్యంలో .. తక్షణమే డిమాండు నోటీసులు జారీ చేసేందుకు ఆయా మునిసిపాలిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఆస్తి పన్నుల గణనలో భవనాల వినియోగం(నివాస/వాణిజ్య), ప్రాంతం(ప్రధాన/సాధారణ), భవన కొలతలు కీలకం. పన్నుల గణన సందర్భంగా ఏ ఒక్క అంశంలో పొరపాటు జరిగినా చెల్లించాల్సిన పన్నుల్లో భారీ తేడా రావచ్చు. ప్రతి మునిసిపాలిటీలో వేల సంఖ్యలో భవనాల కొలతలు స్వీకరించాల్సి ఉండడం, సరిపడా సిబ్బంది లేకపోవడం, ఉన్న సిబ్బందికి అవగాహన లేకపోవడం, కొత్త మునిసిపాలిటీల్లో తొలిసారిగా గణన చేస్తుండడం .. తదితర కారణాలతో ఆస్తి పన్నుల సవరణ ప్రక్రియలో లోపాలు జరిగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అసాధారణ రీతిలో పన్నులు పెరిగినట్లు అనుమానం కలిగినా, అభ్యంతరాలు ఉన్నా, సంబంధిత చెల్లింపుదారులు పునః పరిశీలన కోరుతూ స్థానిక మునిసిపల్ కమిషనర్‌కు నెల రోజుల్లో అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఈ అర్జీని మునిసిపల్ కమిషనర్ 15 రోజుల్లో పరిష్కరిస్తారు. అయినా.. న్యాయం జరగలేదని భావిస్తే పన్ను చెల్లింపుదారులు రాష్ట్ర పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకుల(హైదరాబాద్/వరంగల్)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకున్న నిర్ణయంపై కూడా సంతృప్తి కలగకపోతే పునః సమీక్ష కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్/ఆస్తి పన్నుల బోర్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు అన్ని స్థాయిల్లోని అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుదకు నిర్దేశించిన మొత్తంలో పన్ను వసూలు చేస్తారు.
ఎస్సారెస్పీ నీటి కోసం ఆందోళన ఎమ్మెల్యేను అడ్డుకుని నడిపించిన అన్నదాతలు
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయూలని డిమాండ్ చేస్తూ బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి, బాల్కొండ, మోర్తాడ్ మండలాల రైతులు శనివారం ఆందోళనకు దిగారు. నీరు విడుదల చేయకపోవడంతో చేతికందే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నవమి ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాజెక్టు వద్ద ఉన్న రామాలయూనికి వస్తున్నట్లు తెలుసుకున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకంటానని చెప్పినా వినలేదు. ఒక దశలో ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెడ్ రెగ్యూలేటర్ వరకు కాలి నడకన వెళ్దామని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే మండుటెండలో ప్రాజెక్టు కార్యాలయం వరకు నడిచి వచ్చారు. అధికారులతో మాట్లాడి వెంటనే 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేరుుంచారు.