అనంత్‌రెడ్డి ఔట్‌! 

Nawandgi Society Chairman Ananth Reddy Loses His Post - Sakshi

బషీరాబాద్‌ : తీవ్ర అవినీతి ఆరోపణల్లో మునిగిపోయిన మండల పరిధిలోని నావంద్గి సొసైటీ చైర్మన్‌ అనంత్‌రెడ్డి తన పదవిని కోల్పోయారు. ఆయన అవినీతి వ్యవహారంపై గతంలో పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా అధికారులు విచారణ జరిపారు. చైర్మన్‌ అనంత్‌రెడ్డిని పర్సన్‌ ఇన్‌చార్జిగా కొనసాగించవద్దని డీసీఓ హరిణి పదిహేను రోజుల క్రితం ప్రభుత్వానికి మూడు పేజీల లేఖ రాశారు. చైర్మన్‌ స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రతిపాదిస్తూ కోఆపరేటివ్‌ సొసైటీ కమిషనర్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ వీరభద్రయ్యకు ఈనెల 5న లేఖ అందజేశారు. దీంతో పాటు సహకార సంఘం ఆర్థిక లావాదేవీలపైన జరిపిన ఆడిట్‌లోనూ అక్రమాలు జరిగినట్లు తేలాయి. ఈ రెండు అంశాలను పరిశీలించిన కమిషనర్‌ నావంద్గి సొసైటీ చైర్మన్‌ అనంత్‌రెడ్డిని తొలగించడంతో పాటు, పాలకవర్గాన్ని రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇకపై సొసైటీ పరిపాలనను ప్రత్యేక అధికారి పర్యవేక్షిస్తారని అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందుకు ప్రభుత్వం సహకార సంఘాల పదవీకాలాన్ని ఆరునెలల పాటు పొడగించింది. ఇది ఫిబ్రవరి 4తో ముగిసింది. ఈ క్రమంలో మరో ఆరునెలల పాటు ప్రస్తుత చైర్మన్‌లనే పర్సన్‌ ఇన్‌చార్జిలుగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఇలా జిల్లాలోని అన్ని సహకార సంఘాలు కొనసాగింపునకు అర్హత సాధించాయి. నావంద్గి సొసైటీ మాత్రం కొనసాగింపు అర్హతను కోల్పోవాల్సి వచ్చింది.   

ఫలితమివ్వని పైరవీలు! 
సొసైటీ చైర్మన్‌తో పాటు డీసీసీబీ డైరెక్టర్‌గా కొనసాగిన అనంత్‌రెడ్డి ఎలాగైనా తన పదవిని కాపాడుకోవాలని చివరి వరకు విశ్వ ప్రయాత్నాలు చేశారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రిని ప్రాధేయపడ్డారు. అదేవిధంగా ప్రభుత్వంలో పరపతి ఉన్న అధికార పార్టీ నాయకులను సైతం ఆశ్రయించారు. అక్కడ అభయం దొరకకపోవడంతో ఏకంగా సంఘంలోని ఓ ఉన్నతాధికారితో కాళ్లబేరానికి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. తనను కొనసాగించాలని కోరారు. అదీ కూడా ఫలితమివ్వలేదు. చివరకు జిల్లాలోని తన సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నతాధికారులకు, మాజీ మంత్రి వద్దకు రాయబేరాలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే సొసైటీ పాలకవర్గాన్నే రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో అనంత్‌రెడ్డి తన పదవిని కోల్పోయారు. అయితేరద్దు విషయమై తనకు ఎలాంటి సమాచారం అందలేదని చైర్మన్‌ ‘సాక్షి’తో చెప్పారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top