గెలుపోటములు సహజం

ఎస్పీ శ్రీనివాసరావు నల్లగొండలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం

నల్లగొండ టూటౌన్‌ :  
క్రీడల్లో గెపోటములు సహజమని నల్లగొండ ఎస్పీ శ్రీని వాసరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ ఔట్‌ డోర్‌ స్టేడియంలో నల్లగొండ హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటీలను శుక్రవారం ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడలకు మరింత చేరువ కావల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని కోరారు. క్రీడల వల్ల కలిగే లాభాలు, గుర్తింపు తదితర విషయాలను క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు  విద్యార్థులకు వివరించాలలన్నారు. పట్టుదలతో శిక్షకుల శిక్షణ తీసుకుంటే  అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను ఎస్పీ పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ ఒలింపియన్‌ ముఖేష్‌కుమార్, కూతురు ఫౌండేషన్‌ అధ్యక్షుడు కూతురు లక్ష్మారెడ్డి, జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొండకింది వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్‌ కరీం, శ్రీనివాస్, పీఈటీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

మొదటి రోజు గెలుపొందిన జట్ల వివరాలు
ఖమ్మం జట్టుపై  ఆదిలాబాద్‌ జట్టు 3–0 తో గెలుపు
వరంగల్‌ జట్టుపై మహబూబ్‌నగర్‌ జట్టు 5–0తో విజయం
వరంగల్‌ జట్టుపై హైదరాబాద్‌ జట్టు 6–0తో జయకేతనం
నల్లగొండ జట్టుపై మెదక్‌ జట్టు 8–1తో గెలుపు
ఖమ్మం జట్టుపై మహబూబ్‌నగర్‌ జట్టు 8–0 తో గెలుపు
రంగారెడ్డి జట్టుపై హైదరాబాద్‌ జట్టు 1–0 తో గెలుపు
వరంగల్‌ జట్టుపై ఆదిలాబాద్‌ జట్టు 2–1తో గెలుపు
కరీంనగర్‌ జట్టుపై నల్లగొండ జట్టు 2–1 తో గెలుపు
రంగారెడ్డి జట్టుపై మెదక్‌ జట్టు  5–0 తో గెలుపు

డిండిలో..
డిండి : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో  నిర్వహిస్తున్న నాల్గో జోనల్‌స్థాయి క్రీడాపోటీలు శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా రెండో రోజు జరిగిన 1500 మీటర్ల అండర్‌–19 రన్నింగ్‌ ఫైనల్‌ పోటీల్లో మొదటి విజతగా సరిత(డిండి), నందిని( నల్లకంచ), చంద్రకళ(మర్రికల్‌) ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. షాట్‌పుట్‌ ఫైనల్స్‌ అండర్‌–19 విభాగంలో విజేతగా నాగమణి(కోకట్‌), రెండో స్థానంలో శిరిష( మఠంపల్లి), తృతీయ స్థానంలో వెంకటేశ్వరమ్మ( కమ్మదనం), లాంగ్‌ జంప్‌ ఫైనల్స్‌ అండర్‌–17 విభాగంలో విజేతగా మాయావతి( డిండి), ద్వితీయ స్థానంలో శ్రావణి(తెల్కపల్లి), తృతీయ స్థానంలో మహితా(కమ్మదనం) నిలిచారు.

క్రీడలతో మానసికోల్లాసం
దామరచర్ల(మిర్యాలగూడ) : క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే భాస్కర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం దామరచర్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జోనల్‌ స్థాయి(నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలు) గురుకుల బాలికల క్రీడా పోటీలను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే ప్రపంచస్థాయి ప్రతిభగల్గిన క్రీడాకారులు గురుకులాల నుంచే తయారవుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్‌ నాయక్, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్‌ విండో చైర్మన్‌ దుర్గంపూడి నారాయణ రెడ్డి, సురేష్‌నాయక్, ప్రసాద్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top