చార్జిషీట్‌ ఆపండి

Murder Attempt On YS Jagan High Court Instructions To Police - Sakshi

మేం చెప్పేదాకా వేయొద్దు..

జగన్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసుకు సంబంధించి హైకోర్టు మంగళవారం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో తాము ఆదేశాలు ఇచ్చేంతవరకు సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. జగన్‌పై హత్యాయత్నం కేసులో హడా వుడిగా, మొక్కుబడిగా దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా కేసుకు ముగింపు పల కాలన్న ఆలోచనతో పోలీసులున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదే సమయంలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని వైఎస్‌ జగన్‌ కోరుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సిటీ ఏసీపీ, 5వ పట్టణ ఎస్‌హెచ్‌వో, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీలకు న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది.

మరోవైపు హత్యాయత్నం కేసు దర్యాప్తునకు తమ ముందు దాఖలైన ఈ వ్యాజ్యాలు ఎంత మాత్రంఅడ్డంకి కాదని, దర్యాప్తును యథావిధిగా కొనసాగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి తదుపరి విచారణ నాటికి సీల్డ్‌ కవర్‌లో మరో నివేదికను తమ ముందుంచాలని కూడా సిట్‌ అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాలపై పూర్తిస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై వైఎస్సార్‌ సీపీ తరఫున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తాజాగా జరిపింది. 

దర్యాప్తు పురోగతిపై కోర్టుకు నివేదిక సమర్పించిన ఏజీ...
విచారణ ప్రారంభం కాగానే అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ సిట్‌ దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌కవర్‌లో ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం నివేదికలోని అంశాల ఆధారంగా సందేహాల నివృత్తి కోసం ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన పలువురి వాంగ్మూలాలను కోర్టులో ఉన్న ఏసీపీ నాగేశ్వరరావును అడిగి తెప్పించుకుంది. ఘటన జరిగిన సమయంలో విమానాశ్రయం లోపల ఉన్న వారి సాక్ష్యాలను కూడా నమోదు చేశారా? అంటూ ఆరా తీసింది. ఈ వాంగ్మూలాలను ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. 

సీఎం, డీజీపీకి వాస్తవాలు తెలిసే అలా మాట్లాడుతున్నారు
ఆ తరువాత వైఎస్‌ జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రి, డీజీపీలు దర్యాప్తు తీరును ప్రభావితం చేస్తున్నారని నివేదించారు. అందులో భాగంగానే జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే విలేకరుల సమావేశాలు నిర్వహించి ఘటనను తక్కువ చేస్తూ మాట్లాడారని తెలిపారు. ఇదంతా జగన్‌ డ్రామా అంటూ ఒకరు, ప్రచారం కోసం చేశారంటూ మరొకరు వ్యాఖ్యలు చేశారన్నారు. మంత్రి మండలి మొత్తం సీఎం చంద్రబాబునే అనుసరించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని చెప్పారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన నారా లోకేష్‌ ట్వీట్ల ద్వారా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారంటూ ఆ కాపీలను ధర్మాసనం ముందుంచారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఎవరైనా ప్రభావితం చేస్తుంటే న్యాయస్థానాలు వెంటనే జోక్యం చేసుకుని అటువంటి చర్యలకు అడ్డుకట్టవేస్తాయని, ఇక్కడ కూడా అలాంటి చర్యలే తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించిన వాస్తవాలు ముఖ్యమంత్రి, డీజీపీకి తెలుసని, అందుకే వారు దర్యాప్తును పక్కదారి పట్టేలా మాట్లాడారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాను ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి మాట్లాడారన్నారు. సీఎం, డీజీపీలు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నందునే తాము స్వతంత్ర సంస్థతో విచారణను కోరుతున్నామన్నారు.
 
కోర్టు ఏ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించినా అభ్యంతరం లేదు...
ఏ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు కోరుతున్నారని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించగా... ఈ న్యాయస్థానం ఏ సంస్థ చేత చేయించినా తమకు అభ్యంతరం లేదన్నారు. తమకు కావాల్సింది వాస్తవాలు వెలుగులోకి రావడమేనన్నారు. ఆ స్వతంత్ర సంస్థ దర్యాప్తును ఈ న్యాయస్థానం పర్యవేక్షిస్తే ఇంకా మంచిదని మోహన్‌రెడ్డి నివేదించారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు పని చేస్తున్న రెస్టారెంట్‌ టీడీపీ క్రియాశీలక నేతదని, ఆయన గతంలో ఆ పార్టీ టిక్కెట్‌ కోసం కూడా ప్రయత్నించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
 
నిష్పాక్షిక దర్యాప్తు బాధితుడి హక్కు...
ఆ తరువాత వైఎస్సార్‌ సీపీ తరఫున దాఖలైన వ్యాజ్యంలో మరో సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ డీజీపీ, సీఎంల వ్యాఖ్యల నేపథ్యంలో నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యమయ్యే అవకాశం లేదని కోర్టుకు నివేదించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, అయితే అందుకు భిన్నంగా వారు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు కోరే హక్కు బాధితుడికి ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి గురించి ప్రజలకు ముఖ్యమంత్రి వివరించడంలో తప్పేముందని ప్రశ్నించింది. దీనిపై ఏజీ శ్రీనివాస్‌ స్పందిస్తూ ఈ ఘటన జరిగిన వెంటనే ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారని తెలిపారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడిందని, అందుకే ముఖ్యమంత్రి వాస్తవాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరించారని చెప్పారు. 

ముఖ్యమంత్రి అలా మాట్లాడటం వల్లే మేం కోర్టుకొచ్చాం...
దీనికి ప్రకాశ్‌రెడ్డి సమాధానమిస్తూ... ప్రతి రాజకీయ నేత కూడా ఘటన జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుని వెళుతుందని చెప్పడం పరిపాటని, అయితే ఇక్కడ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి గంటసేపు మీడియాతో మాట్లాడారని కోర్టుకు నివేదించారు. ఆయన ఇదంతా డ్రామా అని అనకుండా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని చెప్పి ఉంటే బాగుండేదన్నారు. అలాకాకుండా దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడటమే అనుమానాలకు తావిస్తోందని, అందుకే తాము నిష్పాక్షిక దర్యాప్తు కోసం కోర్టు మెట్లు ఎక్కామని తెలిపారు. ఘటన జరిగిన తరువాత ఎప్పటికో తాము కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పుపట్టవచ్చునని, అయితే ఘటన జరిగిన వెంటనే న్యాయస్థానానికి వచ్చామని నివేదించారు.

తొలుత ప్రతివాదులందరికీ నోటీసులన్న ధర్మాసనం..
అందరి వాదనలు విన్న ధర్మాసనం సిట్‌ నివేదికను పరిశీలించిన తరువాత ఈ వ్యాజ్యాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన ఇవి సిట్‌ దర్యాప్తునకు ఎటువంటి అడ్డంకి కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి దర్యాప్తు పురోగతిపై మరో నివేదిక సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. ఈ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ స్పందిస్తూ.. ప్రతివాదుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ముఖ్యమంత్రికి నోటీసు అవసరం లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి మినహా మిగిలిన ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top