‘గాంధీ’లో మాతా శిశు సంరక్షణ కేంద్రం | Mother And Child Welfare Center In Gandhi Hospital | Sakshi
Sakshi News home page

‘గాంధీ’లో మాతా శిశు సంరక్షణ కేంద్రం

Jul 24 2018 8:36 AM | Updated on Jul 24 2018 8:36 AM

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి మరో ప్రత్యేక సదుపాయం ఏర్పాటు కానుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సుమారు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్‌ ఫోర్‌ అంతస్తుల్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆస్పత్రి పాలన యంత్రాంగం సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి  భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు.

ఆస్పత్రి ప్రాంగణంలోని ఓపీ విభాగం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించారు. భవన నిర్మాణానికి  60 శాతం కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయించింది. కేంద్ర ప్రతిపాదనల్లో జీ ప్లస్‌ 2 అంతస్తులు మాత్రమే ఉండగా, పెరుగుతున్న రోగుల తాకిడికి అనుగుణంగా మైనస్‌ 2 సెల్లార్‌తోపాటు జీ ప్లస్‌ 4 అంతస్తుల్లో నిర్మిస్తే భవిష్యత్‌తో ఎటువంటి ఇబ్బందులు ఉండవని పాలనయంత్రాంగం అభిప్రాయపడింది.

మరో 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని తొమ్మిది అంతస్తుల భవనానికి అవసరమైన పిల్లర్‌ స్ట్రెంత్‌తో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కేవలం 200 మందికి సరిపడే వసతి సౌకర్యం కల్పించాలని కేంద్రం భావించగా, గాంధీ ఆస్పత్రి గైనకాలజీ, పిడియాట్రిక్‌ వార్డులో సుమారు 400 మందికి సేవలు అందిస్తున్నామని రోగుల సంఖ్యకు అనుగుణంగా వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి అధికారులు తెలిపారు.

ప్రధాన భవనంలోని గైనకాలజీ, పిడియాట్రిక్‌ విభాగాలు సంరక్షణ కేంద్రానికి తరలిస్తే ఆయా ప్రాంతాలను న్యూరోసర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు కేటాయించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు ఈ కేంద్రంలోకి చేరుకునేందుకు సులభంగా ఉంటుందని భావించిన అధికారులు ప్రధాన ద్వారానికి చేరువగా ఈ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పార్కింగ్‌ను వేరే చోటికి తరలించడంతోపాటు రోగుల సహాయకుల విడిది కేంద్రాన్ని మార్చురీ సమీపంలోని స్థలంలో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి  స్కైవాక్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేసి 65 పడకల ఐసీయు, ల్యాబోరేటరీ, ఎమర్జెన్సీ తదితర విభాగాలకు అనుసంధానం చేస్తామన్నారు. భవన నిర్మాణ ప్లాన్‌ మారిన నేపథ్యంలో త్వరలోనే కమిషనర్‌ను కలిసి ఇక్కడి పరిస్థితి వివరిస్తామన్నారు.

కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ నర్సింహరావునేత, గైనకాలజీ, పిడియాట్రిక్, అనస్తీషియా హెచ్‌ఓడీలు మహాలక్ష్మీ, శివరాంప్రసాద్, బేబీరాణి, టీజీజీడీఏ అధ్యక్షకార్యదర్శులు సిద్ధిపేట రమేష్, వసంత్‌కుమార్, ఆర్‌ఎంఓలు జయకృష్ణ, శేషాద్రి, సాల్మన్,ప్రభుకిరణ్, వైద్యులు శ్రీదేవి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ డిప్యూటీ ఇంజనీర్‌ కరుణాకరాచారి, ఏఈ వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement