breaking news
Mother and child welfare
-
‘గాంధీ’లో మాతా శిశు సంరక్షణ కేంద్రం
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి మరో ప్రత్యేక సదుపాయం ఏర్పాటు కానుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సుమారు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ ఫోర్ అంతస్తుల్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆస్పత్రి పాలన యంత్రాంగం సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలోని ఓపీ విభాగం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించారు. భవన నిర్మాణానికి 60 శాతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయించింది. కేంద్ర ప్రతిపాదనల్లో జీ ప్లస్ 2 అంతస్తులు మాత్రమే ఉండగా, పెరుగుతున్న రోగుల తాకిడికి అనుగుణంగా మైనస్ 2 సెల్లార్తోపాటు జీ ప్లస్ 4 అంతస్తుల్లో నిర్మిస్తే భవిష్యత్‌తో ఎటువంటి ఇబ్బందులు ఉండవని పాలనయంత్రాంగం అభిప్రాయపడింది. మరో 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని తొమ్మిది అంతస్తుల భవనానికి అవసరమైన పిల్లర్ స్ట్రెంత్తో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కేవలం 200 మందికి సరిపడే వసతి సౌకర్యం కల్పించాలని కేంద్రం భావించగా, గాంధీ ఆస్పత్రి గైనకాలజీ, పిడియాట్రిక్ వార్డులో సుమారు 400 మందికి సేవలు అందిస్తున్నామని రోగుల సంఖ్యకు అనుగుణంగా వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ప్రధాన భవనంలోని గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాలు సంరక్షణ కేంద్రానికి తరలిస్తే ఆయా ప్రాంతాలను న్యూరోసర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు కేటాయించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు ఈ కేంద్రంలోకి చేరుకునేందుకు సులభంగా ఉంటుందని భావించిన అధికారులు ప్రధాన ద్వారానికి చేరువగా ఈ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పార్కింగ్‌ను వేరే చోటికి తరలించడంతోపాటు రోగుల సహాయకుల విడిది కేంద్రాన్ని మార్చురీ సమీపంలోని స్థలంలో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి స్కైవాక్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి 65 పడకల ఐసీయు, ల్యాబోరేటరీ, ఎమర్జెన్సీ తదితర విభాగాలకు అనుసంధానం చేస్తామన్నారు. భవన నిర్మాణ ప్లాన్ మారిన నేపథ్యంలో త్వరలోనే కమిషనర్‌ను కలిసి ఇక్కడి పరిస్థితి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహరావునేత, గైనకాలజీ, పిడియాట్రిక్, అనస్తీషియా హెచ్ఓడీలు మహాలక్ష్మీ, శివరాంప్రసాద్, బేబీరాణి, టీజీజీడీఏ అధ్యక్షకార్యదర్శులు సిద్ధిపేట రమేష్, వసంత్‌కుమార్, ఆర్‌ఎంఓలు జయకృష్ణ, శేషాద్రి, సాల్మన్,ప్రభుకిరణ్, వైద్యులు శ్రీదేవి, టీఎస్ఎంఎస్ఐడీసీ డిప్యూటీ ఇంజనీర్ కరుణాకరాచారి, ఏఈ వేణు తదితరులు పాల్గొన్నారు. -
కొన్నిసార్లు సిజేరియన్లు అనివార్యం
మాతా శిశువుల దీర్ఘకాల ప్రయోజనాలు ముఖ్యం - దేశంలో కోత కాన్పులు 17 శాతమే - అంతర్జాతీయ గైనకాలజిస్టుల సదస్సులో వక్తలు సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో సిజేరియన్లు పెరగడం భారత్‌కే పరిమితం కాదని, అనేక కారణాల రీత్యా ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పలువురు గైనకాలజిస్టులు అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్లు, గర్భధారణలు అధిక వయసులో జరగడం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో కొన్నిసార్లు ఇవి అనివార్యమవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో మాతాశిశు సంక్షేమం, నవజాత శిశువుల ఆరోగ్యంపై అంతర్జాతీయ గైనకాలజిస్టుల సదస్సు ‘ఫాగ్సీ – ఫీగో – 2017 ప్రారంభమైంది. అనేక దేశాలకు చెందిన దాదాపు 1,500 మంది గైనకాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు. భారత్‌లో మొత్తం కాన్పుల్లో దాదాపు 17 శాతమే సిజేరియన్లు అని ఫాగ్సీ –ఫీగో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్.శాంతకుమారి చెప్పారు. దక్షిణ అమెరికాకు చెందిన బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో 70 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల కొరత తీవ్రంగా ఉందని, దీంతో సమస్య మరింత జటిలమవుతోందని ఆమె వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం తగురీతిలో స్పందించకపోతే అత్యవసర సేవలను నిలిపివేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. సంతానలేమి పెరుగుతోంది: రిష్మా ధిల్లోన్ పై దేశంలో ఏటికేటికీ సంతాన లేమి సమస్య పెరుగుతోందని ఫాగ్సీ అధ్యక్షురాలు రిష్మా ధిల్లోన్ పై తెలిపారు. గడచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి, కాలుష్యం తదితరాలు దీనికి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతినెలా 9న గర్భిణులకు ఉచిత సేవలు అందించేందుకు గైనకాలజిస్టులు చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. సురక్షితమైన కాన్పుల సంఖ్యను మరింతగా పెంచేందుకు నర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మొత్తం పది లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యమని సంస్థ కార్యదర్శి డాక్టర్ హేమా దివాకర్ తెలిపారు. వైద్యులను నమ్మాలి: ప్రొఫెసర్ సీఎన్ పురందరే సిజేరియన్ల విషయంలో గైనకాలజిస్టులపై విమర్శలు వస్తున్నాయని, అయితే కొందరు తప్పితే చాలామంది డాక్టర్లు తమ శక్తి మేరకు తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రయత్నిస్తుంటారని ఫీగో చైర్మన్ ప్రొఫెసర్ సీఎన్ పురందరే స్పష్టం చేశారు. గర్భిణుల్లో 17 నుంచి 19 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్న వారు ఉంటున్నారని, సహజ కాన్పు వద్దని సిజేరియన్లే కావాలని కోరేవారి సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పారు.