దెయ్యం చెట్టు..! | Most Dangerous Tree In Warangal District | Sakshi
Sakshi News home page

దెయ్యం చెట్టు..!

Nov 2 2018 1:38 PM | Updated on Nov 2 2018 1:38 PM

Most Dangerous Tree In Warangal District - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఏడాకుల పాల.. ఈ చెట్టు శాస్త్రీయ నామం ఆల్సో్టనియా స్కాలరీస్‌. వరంగల్‌ జిల్లాలో 50 లక్షలకు పైగానే పెరుగుతున్నాయి. అడవుల్లో పుట్టిన ఈ వృక్షాన్ని  ఆదిమ జాతి గిరిజనులు  దెయ్యం చెట్టు అని పిలుస్తారు. చెట్టు వైపు కన్నెత్తి కూడా చూడరు. దాని నీడను తాకడానికి కూడా భయపడుతారు. ఎందుకంటే ఈ వృక్షం మీద దెయ్యాలు ఉంటాయంటారు.  ఇటీవల పరిశోధనల్లో ఇది నిజంగా దెయ్యపు వృక్షమే అని తేలింది. దీని పుప్పొడి రేణువులు మానవాళికి అత్యంత ప్రమాదకరమని, శ్వాస కోశ వ్యాధులు, అస్తమా, అలర్జీ వస్తుందని తేలింది. అదే పనిగా చెట్టు కింద ఉండేవారి ఊపిరితిత్తుల్లో పుప్పడి రేణువులు పేరుకపోయి స్పృహ కోల్పోతారని తేలింది. ప్రధానంగా చెట్టు సమీపంలో నివసించే వారికి, మార్నింగ్‌ వాక్‌ చేసే వాళ్లు, వృద్ధులు, పిల్లల మీద ప్రభావం ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ హరితహారంలో ఈ మొక్కలను నాటొద్దని అటవీ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

ఆరోగ్యంపై ప్రభావం..
నీళ్లు లేకపోయిన ఏపుగా, అత్యంగా వేగంగా పెరిగే ఏడాకుల పాల చెట్టును హరితహారంలో భాగంగా వరంగల్‌ నగరంతోపాటు సమీప ప్రాంతంలో భారీ ఎత్తున నాటారు. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం 50 లక్షలకు పైగానే  మొక్కలను నాటినట్లు తెలుస్తోంది. ఈ పొడవైన, సొగసైన వృక్షం కఠినమైన బూడిదరంగు బెరడును కలిగి ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలు వలయంగా,  ఆకులు ఒకే చోట అనేకం వస్తాయి. ఈ ఆకులు కొంచెం గుండ్రంగా, తోలు వలె ముదురు ఆకుపచ్చగా గుచ్ఛంలా ఉంటాయి. దాదాపుగా ఒక్కో గుచ్ఛానికి ఏడు ఆకులే ఉంటాయి,  ఈ ఆకులను గిల్లుతే పాలు కారుతాయి. అందువలనే ఈ చెట్టును ఏడాకుల పాల అని పిలుస్తారు. ఇప్పుడా మొక్కలు పెరిగి పెద్దవి అయ్యాయి.. పుష్పిస్తున్నాయి. ఇవి వెదజల్లుతున్న పుప్పడితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  అక్టోబరులో అంటే చలికాలం సీజన్‌లో ఈ చెట్టు  కొమ్మలకు ఉన్న పుష్పాలు అన్నీ ఒకే సారి పుష్పిస్తాయి. లక్షల కొద్ది పుప్పడిని బయటికి వెదజల్లుతాయి. చలి మంచుకు  çపుప్పడి రేణువులు బరువుగా మారి వాతావరణంతో మనుషుల శ్వాసకు అందే ఎత్తులో వాతావరణంలో తేలియాడుతూ ఉంటాయి. దీంతో మనుషుల్లో అలర్జీ, అస్తమా, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది.

వచ్చే హరితహారంలో వీటిని నాటం
ఏడాకుల పాల చెట్లతో అస్తమా రోగులకు ఇబ్బంది అనేది కొంత మేరకు వాస్తవమే.  ఇప్పటివరకు 50 లక్షల మొక్కల వరకు నాటాం. వచ్చే హరితహారం నుంచి  ఆ మొక్కలను పెట్టం. నీడనిచ్చే మొక్కలు కాబట్టి వీటి పెంపకాన్ని చేపట్టాం. ఆరోగ్యపరంగా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతంలో తొలగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.
– కె.పురుషోత్తం, అర్బన్‌ జిల్లా ఇన్‌చార్జి అటవీ శాఖాధికారి 

ఊపిరితిత్తులపై ప్రభావం..
ఏడాకుల పాల చెట్ల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇవి ప్రమాదరకమని తెలియక నాటడంతో పెరిగాయి.  పుప్పడి రేణువులతో మనుషులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. లక్షలాది పుప్పొడి రేణువులు గాలిలో కలిసిపోతాయి, వాటిని పీల్చడం వల్ల మనుషులకు అలర్జీ, అస్తమా, కళ్లమంటలు వస్తాయి. అంతేగాకుండా ఊపిరితిత్తులకు కూడా ఎఫెక్ట్‌ అవుతుంది.  
– వి.కృష్ణారెడ్డి, కేయూ బాటనీ ఆచార్యులు

కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది
ఏడాకుల పాలతో ప్రమాదకరమే. కిడ్నీ, ఊపిరితిత్తులు, చర్మ, కంటి సంబంధిత వ్యాధులు వస్తాయి. నా దగ్గరకు వచ్చే పేషెంట్లను చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించమని సలహా ఇస్తాను,  ఏడాకుల పాల చెట్టు సమీపంలో ఉన్న వాళ్లకు సీజన్‌ ముగిసే వరకు దానికి దూరంగా ఉండడం మంచిదని సలహా ఇస్తున్నాను.
– డాక్టర్‌ శ్రీనివాసవర్మ, చెస్ట్‌ ఫిజీషియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement