సారొస్తున్నారు..

MLA Harish Rao Checks The Arrangements For The Visit Of CM KCR In Chintamadaka - Sakshi

సీఎం రాక నేపథ్యంలో చింతమడకలో మాజీమంత్రి హరీశ్‌రావు సమీక్ష  

సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్‌ తన స్వగ్రామమైన చింతమడకకు ఈ నెలలో రానున్నారని గ్రామస్తులు ఐక్యమత్యంతో, క్రమశిక్షణతో ఊరు గౌరవాన్ని కాపాడేలా సీఎం సారుకు స్వాగతం పలకాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శుక్రవారం సాయంత్రం చింతమడకలో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌తో కలిసి రెండు గంటల పాటు సమీక్షించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డబుల్‌ బెడ్రూంలు సభాస్థలి, వన భోజనాల నిర్ధేశిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌ సభా సమావేశంలో హాజరయ్యే చింతమడక గ్రామస్తులకు ప్రత్యేకించి ఐడెంటీ కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటీవల గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిన అధికారులు మీఇంటికి వచ్చి ఐడెంటిటీ కార్డులను అందజేస్తారని వివరించారు. గ్రామస్తులంతా ఐక్యమత్యంతో మెదిలి మన ఊరు, మన గౌరవాన్ని కాపాడేలా వ్యవహారించాలని కోరుతూ ఏదైనా విన్నపాన్ని చేయాలంటే కుల సంఘాలు, మహిళా సంఘాల వారిగా విన్నవించాలని సూచించారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం సభా సమావేశం జరిగే స్థలాన్ని పరిశీలించారు. ఐకేపీ గోదాం, సీసీ ప్లాట్‌ఫాం వద్ద సభ, సమావేశం జరిగేలా దాదాపు 3200ల మంది గ్రామస్తులను అనుమతించే విధంగా కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు.

 అధికారిక యంత్రాంగానికి గ్యాలరీలో 200, మరో రెండు వందల కుర్చీలతో ప్రెస్‌ గ్యాలరీని ఏర్పాటు చేసి 3600ల మందితో రెయిన్‌ ప్రూఫ్‌ సభావేదిక పనులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. పలుచోట్లు అవసరమైన మార్పులు, చేర్పుల గురించి అక్కడికక్కడే అధికారులకు, నిర్వాహకులకు దిశానిర్ధేశం చేశారు. గ్రామంలో నిర్వహించనున్న సభ, సమావేశ, భోజన సదుపాయాలను, భారీ పోలీసు భద్రత చర్యలతో పాటు అవసరమైన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఆ తర్వాత పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో వనభోజనాలు ఏర్పాట్లపై స్థల పరిశీలన చేస్తూ, అలయం పక్కనే ఉన్న చింత చెట్టు కింద సీఎం కేసీఆర్‌ సహఫంక్తి భోజనం చేసే ఏర్పాట్లు, పక్కన ఖాళీ స్థలంలో గ్రామస్తులంతా భోజనం చేసే విధంగా ఏర్పాట్లపై కలెక్టరు, సీపీ జోయల్‌ డేవిస్, ఏసీపీ రామేశ్వర్, అధికారిక, ప్రజాప్రతినిధులతో చర్చించారు. వన భోజనాల వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాట్లు  ఉండాలని సూచించారు. అనంతరం గ్రామ శివారులో 10 ఎకరాలలో సీఎం కేసీఆర్‌తో శంకుస్థాపన చేయించనున్న బీసీ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాల వసతి గృహస్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు శ్రవణ్, రామలక్ష్మి, సుదర్శణ్‌రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, సరోజ, పలు శాఖ అధికారులు, రూరల్‌ తహసీల్దారు రమేష్, గ్రామ సర్పంచ్‌ హంసకేతన్‌రెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

30 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారి

సిద్దిపేటరూరల్‌: కేసీఆర్‌ చింతమడక పర్యటన నేపథ్యంలో 30 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు  తెలిపారు. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట సమీకృత కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్, పలు అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. గ్రామంలో ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సర్వే చేసిన అధికారులే గ్రామస్తులకు ఇంటింటికీ వెళ్లి ఐడీ కార్డులను అందించాలన్నారు.

గ్రామంలో ఉన్న 630 గృహాలకు గాను 30 ఇళ్లకు ఒక ఎంపీడీఓ, మరో ప్రత్యేక అధికారి నియమించనున్నట్లు తెలిపారు. 30 ఇళ్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ స¿సమావేశం పూర్తయ్యే వరకు బాధ్యత అధికారిదేనన్నారు. అదే విధంగా పలు అధికారులతో సమీక్షించి త్వరితగతిన గ్రామంలో  జరుగుతున్న పనులు, పెద్ద చెరువు సుందరీకరణపై ఇరిగేషన్‌ అధికారులతో చర్చించి, కావాల్సిన ప్రజెంటేషన్‌ సిద్ధం చేయాలని సూచించారు. సీఎం రాక సందర్భంగా సభ, సమావేశంలో ఉండాల్సిన వసతులు, అలాగే గ్రామస్తులు, వీఐపీ, మీడియా ప్రతినిధులకు భోజనాల వద్ద ఉండాల్సిన అధికారిక యంత్రాంగం వంటి అంశాలమీద చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవిందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top