
‘మిషన్ కాకతీయ’ అద్భుతం
రాష్ట్రంలో చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి బ్రిటన్ పార్లమెంటరీ బృందం కితాబిచ్చింది.
బ్రిటన్ పార్లమెంట్ బృందం కితాబు
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను
ఆసక్తిగా తిలకించిన ఎంపీలు
వారితో సమావేశమైన స్పీకర్, మండలి చైర్మన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి బ్రిటన్ పార్లమెంటరీ బృందం కితాబిచ్చింది. బ్రిటన్‌కు చెందిన ఎంపీ వీరేంద్ర శర్మ నేతృత్వంలో ఎంపీలు నస్రత్ ఘని, లార్డ్ రాణా, హెలెన్ గార్డెనర్ బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా శాసనసభ కార్యదర్శి డాక్టర్ రాజా సదారాం వారికి స్వాగతం పలకగా అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ ఎస్. మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ బ్రిటన్ బృందంతో సమావేశమయ్యారు. కొత్తగా రాష్ట్రం అరుునా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని వివరించారు.
దేశంలోనే ఉత్తమ శాసనసభగా తెలంగాణ అసెంబ్లీ పనిచేస్తోందని, సమావేశాల్లో సుదీర్ఘ చర్చలు జరుపుతోందని తెలిపారు. సమావేశాలను కాగితరహితంగా మార్చేందుకు ఐటీ సేవలను సమర్థంగా వినియోగించుకుంటున్నామన్నారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యంగా మిషన్ కాకతీయ గురించి ఇరిగేషన్‌శాఖ అధికారులు బ్రిటన్ పార్లమెంటు బృంద సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పథకం అమలు వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన తీరును తెలియజేశారు. కాకతీయుల కాలం నాటి చెరువులను పటిష్టం చేసి నీటి నిల్వలను పెంచుతున్న ఈ పథకం విజయగాథను బ్రిటన్ బృందం ఆసక్తిగా తిలకించింది.
మిషన్ కాకతీయ అద్భుత పథకమంటూ ప్రశంసల జల్లు కురిపించింది. ఇలాంటి పథకం భారత్‌లో మరెక్కడైనా అమలవుతుందా అని అధికారులను ఆరా తీసింది. సమావేశంలో అసెంబ్లీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.కె.జోషీ, మైనర్ ఇరిగేషన్ సెక్రటరీ వికాస్‌రాజ్‌లు పాల్గొన్నారు. బ్రిటన్ పార్లమెంటరీ బృందం వెంట బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ (హైదరాబాద్) రాజకీయ-ఆర్థిక సలహాదారు నళినీ రఘురామన్ ఉన్నారు.