‘మిషన్‌ కాకతీయ’...నిధులు లేవాయె..! | Sakshi
Sakshi News home page

‘మిషన్‌ కాకతీయ’...నిధులు లేవాయె..!

Published Mon, Jan 6 2020 4:59 AM

Mission Kakatiya Works In 4 Parts Of The State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్‌ కాకతీయ’పనులు చివరి దశలో చతి కిలపడ్డాయి. ఏడాదిగా నిధుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో మూడు, నాలుగో విడతలో చేపట్టిన 5,553 చెరువుల పనుల్లో స్తబ్దత ఏర్పడింది. నిధులు విడుదల చేస్తే తప్ప ముందుకు కదిలే పరిస్థితి ఏర్పడింది.

ఎక్కడివక్కడే...
రాష్ట్రంలో 4 విడతలుగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం కింద 27,625 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో 26,989 చెరువుల పనులు ఆరంభించారు. ఇప్పటి వరకు 21,436 పనులు పూర్తయ్యాయి. మొదటి, రెండో విడతలో చేసినంత వేగంగా మూడు, నాలుగో దశల్లో ముం దుకు కదలడం లేదు. మూడో దశలో 5,958 పనులు చేపట్టగా 3,918 చెరువులే పూర్తయ్యాయి. మరో 2,040 చెరువుల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి.  వీటిని గతేడాది జూన్‌ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినా అవి ముందుకు సాగడం లేదు. ఇక 4వ విడతలో 4,214 చెరువుల పనుల్లో ఇప్పటివరకు 1,742 పనులే పూర్తయ్యాయి. మరో 2,472 పనులు పూర్తి కాలేదు. భారీ ప్రాజెక్టుల అవసరాలకే నిధుల మళ్లింపు జరగడంతో ‘మిషన్‌ కాకతీయ’కు అనుకున్న మేర నిధుల ఖర్చు జరుగలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖను సంప్రదించినప్పుడల్లా అరకొర నిధులను విదిల్చి చేతులు దులుపుకుంటోంది.

పెండింగులో రూ.450 కోట్లు...
ప్రస్తుతం రూ.450 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పనులు చేయాల్సిన సీజన్‌ అంతా వృథాగా పోతోంది. జూన్‌ నుంచి వర్షాలు మొదలైతే పనులు కొనసాగించే వీలుం డదు. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణను నీటిపారుదల శాఖ ఎలా ముగిస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ‘మిషన్‌ కాకతీయ’ప్రభావం ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై చూపనుంది. రూ.4 కోట్లకు పైగా అంచనాలతో చెక్‌డ్యామ్‌లకు టెండర్లు పిలవనున్నారు. వీటి బిల్లుల చెల్లింపులో జాప్యం భయంతో నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా? అన్నది ప్రశ్నగా ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement