ఒక ద్రోహి సమాచారం వల్లే ఆ ఎన్‌కౌంటర్‌ | maoist party condemns thadapala gutta encounter | Sakshi
Sakshi News home page

Mar 3 2018 12:49 PM | Updated on Mar 3 2018 4:46 PM

 maoist party condemns thadapala gutta encounter - Sakshi

(ఇన్‌సెట్‌)మావోయిస్ట్‌ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌..

సాక్షి, హైదరాబాద్‌ : తడపలగుట్టల్లో పోలీసులు శుక్రవారం జరిపిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేతలు ఎవరూ మరణించలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు.. మిగతావారు ఛత్తీస్‌గఢ్‌ దంతేవాడ జిల్లాకు చెందినవారని ఆయన వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన దబోయిన స్వామి అలియాస్‌ ప్రభాకర్‌, కడిపికొండ జిల్లా కమిటీ కార్యదర్శి రత్న తెలంగాణ వారని వివరించారు. కార్పొరేట్‌ శక్తులను కాపాడేందుకు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులైన.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం సమీపంలో ఉన్న తడపలగుట్టల్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పది మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్‌ అలియాస్‌ యాప నారాయణ, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, కొయ్యాడ గోపన్న అలియాస్‌ సాంబయ్య ఆలియాస్‌ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానాలు రాగా.. ఈ వార్తలను సీపీఐ (మావోయిస్టు పార్టీ) తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌ ఖండించారు. ఆయన ఏమన్నారంటే..

‘ప్రజలతో మాట్లాడుతూ సేదదీరుతున్న సమయంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఏకపక్షంగా కాల్పులు జరిపారు. పోలీసులు ప్రచారం చేస్తున్నట్లు ఈ ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి చనిపోలేదు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 10 మందిలో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారు. మిగతా కామ్రేడ్స్ అంతా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన వారు’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

కార్పొరేట్ శక్తులకు నీళ్లు, భూమిని ధారాదత్తం చేసేందుకే కేసీఆర్ ఈ విధమైన బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇకపై తాము టీఆర్ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. హిందుత్వ నాయకుడు రమణ్‌సింగ్, నియంత కేసీఆర్‌లు కలిసికట్టుగా ఆదివాసీలను, ప్రశ్నించే వారిని నిర్మూలించేందుకు దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత చనిపోయింది ఎవరనేది తెలిసినప్పటికీ పోలీసులు ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించడం కోసం అబద్ధాలు ప్రచారం చేశారని, ముఖ్యనాయకులు చనిపోయారని ప్రచారం చేసి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. కార్పొరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తోందని, ప్రజల సహకారంతో ఈ దాడులన్నింటినీ తిప్పికొడతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement