జిల్లాలో ఉర్దూ వెబ్‌సైట్‌.. | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఉర్దూ వెబ్‌సైట్‌..

Published Tue, Jul 2 2019 11:55 AM

Mahabubnagar Collector Ronald Rose Launched Urdu Web Site - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైన మహబూబ్‌నగర్‌ జిల్లా నేడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు ఇంగ్లీషు, తెలుగులోనే అందుబాటులో ఉండే మహబూబ్‌నగర్‌ జిల్లా వెబ్‌సైట్‌ను సరికొత్తగా ఉర్దూ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. ఉర్దూ మాట్లాడే, చదివే వారికోసం స్వాస్‌ సాంకేతిక టెక్నాలజీ సహాయంతో ఈ ఉర్దూ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశారు. ఉర్దూలో మహబూబ్‌నగర్‌ జిల్లా ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌ ప్రస్తుతం అందుబాటులోకి రావడంపై ఉర్దూ భాష మాట్లాడే వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్‌ డి.రొనాల్డ్‌రోస్‌ ఈ సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఉర్దూ భాషలో మహబూబ్‌నగర్‌ జిల్లా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్‌ఐసీ అధికారులు అందుబాటులో ఉన్న సాంకేతిక టెక్నాలజీ వినియోగించి తుది మెరుగులు దిద్దారు. నెల రోజులపాటు కసరత్తు చేసిన ఎన్‌ఐసీ అధికారులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మహబూబ్‌నగర్‌ జిల్లా ఉర్దూ వెబ్‌సైట్‌కు అంకురార్పన చేశారు. 

దేశంలోనే మొదటిసారి..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో బాగంగా దేశంలోనే మొదటిసారిగా మహబూబ్‌నగర్‌ జిల్లా వెబ్‌సైట్‌ను ఉర్దూలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌ను ఇంగ్లిష్, తెలుగులో నిర్వహిస్తుండటమే కాకుండా అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి సైతం అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఉర్దూ భాషలోనూ వెబ్‌సైట్‌ ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లా తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి మెరుగైన ఫలితాలు తీసుకురానుంది. అయితే జిల్లాలో ఇప్పటికే డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో బాగంగా ఈ–ఆఫీస్‌ విధానంతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని అనుసంధానం చేసి ఫైళ్ల నిర్వహణను అత్యంత సులభతరం చేయడంలో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సఫలీకృతులయ్యారు. ప్రతీ అధికారి, కింది స్థాయి సిబ్బంది ఎవరూ కార్యాలయాల చుట్టూ సంతకాల కోసం, అనుమతుల కోసం తిరిగే వీలు లేకుండా తమ కార్యాలయం నుండే ఈ–ఆఫీస్‌ విధానంతో క్షణాల్లో అనుతులు తీసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు.

అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకుల సమక్షంలో.. 
ఈ విధానంతో పనిభారం తగ్గడమే కాకుండా అధికారులు అందుబాటులో ఉండే అవకాశం కలిగింది. ఇదిలాఉండగా,  ఉర్దూ వెబ్‌సైట్‌ను మొదటిసారిగా అందుబాటులోకి తేవడం ఎంతో గర్వకారణమని జిల్లా అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ రొనా ల్డ్‌రోస్‌ సోమవారం ప్రజావాణి కార్యక్రమం వేదికగా అఖిలపక్ష పార్టీల ము స్లిం నాయకుల సమక్షంలో ఉర్దూ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనకు స్వాస్‌ సాంకేతిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందని, ఎన్‌ఐసీ అధికారుల శ్రమ ఫలితంగా ఉర్దూ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించేందుకు వీలుకలిగిందని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు.

Advertisement
Advertisement