అమ్మో పులి.. వెన్నులో చలి | Leopard walking rattled people | Sakshi
Sakshi News home page

అమ్మో పులి.. వెన్నులో చలి

Sep 30 2014 2:58 AM | Updated on Oct 4 2018 6:03 PM

దోమకొండ శివారులో ఆదివారం పులి సంచరించిందని తెలియడంతో జనం భయాందోళనలు చెందుతున్నారు.

- చిరుత సంచారంతో వణుకుతున్న ప్రజలు
- పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్న రైతులు
- అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

 దోమకొండ : దోమకొండ శివారులో ఆదివారం పులి సంచరించిందని తెలియడంతో జనం భయాందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా మల్లన్న గుడి శివారులోని పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా పులి ప్రతిరోజు 25 కిలోమీటర్ల వరకు నడుస్తుందని తాగునీటి కోసం ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. జింకలు, కుందేళ్లు వంటి వాటిని అది వేటాడి తింటుందని, అలాంటి జంతువులు దానికి ఇక్కడ కనిపించక వెళ్లిపోయి ఉంటుందంటున్నారు. కాగా ప్రజలు మాత్రం చిరుతను తలచుకొని భయపడుతున్నారు.

దోమకొండ వాసులు రెండు రోజుల క్రితం వరకు మల్లన్న గుడి పక్కనుంచి భిక్కనూరు మండలంలోని జంగంపల్లి శివారులోని శ్రీకృష్ణ మందిరం వరకు గల దారినుంచి కామారెడ్డికి వెళ్లేవారు. ఇది ఇరుకైన మార్గం. అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచారం విషయం తెలియడంతో ఇక్కడి ప్రాంతానికి చెందిన వారు కామారెడ్డి వెళ్లడానికి లింగుపల్లి, భిక్కనూరు మండలం బీటీఏస్ చౌరస్తా మీదుగా వెళుతున్నారు.
 
మల్లన్న గుడి వద్ద రైతుల సమావేశం
చిరుత సంచారం విషయం తెలియడంతో అటవీ శాఖ అధికారులు మల్లన్న గుడి వద్ద రైతులతో సమావేశమయ్యారు.
చిరుతపులి సంచరిస్తున్నందున రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లరాదని అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఫారూఖ్ రైతులకు సూచించారు. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున వెళ్లాలని పేర్కొన్నారు. చేతిలో కనీసం కర్రనైనా ఉంచుకోవాలన్నారు. చప్పుడు చేస్తూ నడవడం మంచిదని సూచించారు. దోమకొండ శివారులోకి వచ్చింది చిరుత పులా లేదా పులా అనే విషయం నిర్ధారణ కాలేదన్నారు. ఇక్కడ కనిపించిందని చెబుతున్న పులి పొలం గట్లమీద గడ్డిపై నడించిందని దాని అడుగులు గుర్తించడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పులి సంచారం విషయమై డీఎఫ్‌వోకు వివరాలు తెలిపానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement