విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు | Lack of vitamin D may increase heart disease risk | Sakshi
Sakshi News home page

విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు

Mar 27 2014 2:49 AM | Updated on Apr 3 2019 4:37 PM

ఇన్నాళ్లూ హైపర్ టెన్షన్, మధుమేహం, రక్తపోటు, అధిక కొవ్వు తదితర కారణాల వల్ల పక్షవాతం, గుండె జబ్బులు వస్తున్నాయనేది వైద్యుల అభిప్రాయం.

యశోద ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో వెల్లడి
 సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ హైపర్ టెన్షన్, మధుమేహం, రక్తపోటు, అధిక కొవ్వు తదితర కారణాల వల్ల పక్షవాతం, గుండె జబ్బులు వస్తున్నాయనేది వైద్యుల అభిప్రాయం. కానీ, తాజాగా యశోద ఆస్పత్రికి చెందిన వైద్యుల పరిశోధనలో విటమిన్ డి (హైడ్రాక్సి విటమిన్ డి) లోపం కారణంగా పక్షవాతం, గుండెపోటు వస్తున్నాయని తేలింది. యశోద ఆస్పత్రికి చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.జైదీప్ రే చౌదరి.. తన బృందంతో సుమారు ఏడాదిపాటు దీనిపై పరిశోధన చేశారు. పక్షవాతం, గుండె జబ్బులు వచ్చిన సుమారు 250 మందిపై ఈ పరిశోధనలు సాగించారు. ఇందులో ప్రధానంగా విటమిన్ డి లోపం కారణంగా పక్షవాతం, గుండె పోటు వస్తున్నట్టు తేలింది. ప్రతి రోగి నుంచి 5 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి పలు కోణాల్లో పరిశోధన చేశారు. ఈ పరిశీలనలో విటమిన్ డి లోపంతో 122 మందికి పక్షవాతం(పెరాలసిస్), గుండె జబ్బులు వచ్చినట్టు తేలింది. 24 ఏళ్లనుంచి 78 ఏళ్లలోపు వయసున్న రోగులపై పరీక్షలు నిర్వహించగా ఎక్కువగా 50 ఏళ్లలోపు వారే ఉన్నారు. పక్షవాతానికి ప్రధాన కారణమైన హైపర్ టెన్షన్ తర్వాతి స్థానం విటమిన్ డి లోపమేనని తేలింది.
 
 కారణాలు ఇవే..: విటమిన్ డి లోపం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉందని డాక్టర్ జైదీప్ రే తెలిపారు. చాలామంది సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి ని పొందలేకపోతున్నారని, కొన్ని ఆహార పదార్థాల్లో లభించే అవకాశమున్నా వాటిని కూడా తినడం లేదని, జీవనశైలి కారణంగా ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశోధనలో వైద్యులు రుక్మిణి మృదుల, అల్లూరి అనామిక, దేముడు బాబు బొడ్డు, ప్రదీప్ కుమార్ మిశ్రా, ఎ.లింగయ్య, బండా బాలరాజు, బండారు శ్రీనివాసరావులు సహకరించినట్లు మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement