కృష్ణమ్మ.. కరుణిస్తోంది! | krishna river water helpful to rabi season | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ.. కరుణిస్తోంది!

Oct 9 2017 3:16 AM | Updated on Sep 27 2018 5:46 PM

krishna river water helpful to rabi season - Sakshi

నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌: గత నెల రోజులుగా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు.. రైతాంగంలో ఆశలు రేపుతున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్‌ కింద ఖరీఫ్‌ పూర్తిగా డీలా పడ్డా..రబీ ఆశలు మాత్రం సజీవమవుతున్నాయి. శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండేందుకు దగ్గరవడం, ఇక వచ్చే నీరంతా దిగువన సాగర్‌లోకి చేరనుండటం ఆయకట్టు రైతాంగాన్ని ఆనందంలో ముంచుతోంది. దీనికి తోడు వచ్చే జూలై వరకు రాష్ట్ర తాగు, సాగు అవసరాలను సిద్ధం చేసిన తెలంగాణ నీటి పారుదల శాఖ, సాగర్‌ పరిధిలో పూర్తిస్థాయి రబీ ఆయకట్టుకు నీరిచ్చేలా తమకు 54.5 టీఎంసీల మేర కేటాయింపులు చేయాలని కృష్ణాబోర్డును కోరడం, అందుకు తగ్గట్లే ప్రణాళిక రూపొందించడం ఆయకట్టు రైతుల్లో ఆశలు నింపుతోంది.

నిండేందుకు సిద్ధంగా శ్రీశైలం..
నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండేందుకు సిద్ధమైంది. గడచిన ఇరవై రోజులుగా స్థిరంగా వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకొంది. ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి నుంచి 45 వేలు, నారాయణఫూర్‌ నుంచి 52వేల క్యూసెక్కుల పైచిలుకు నీరు దిగువకు వస్తోంది. దీంతో జూరాలవద్ద 30వేల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదుకాగా, ఈ ప్రాజెక్టు నుంచి 34,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి దిగువకు ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలానికి 52,375 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉంది. ఇక్కడి నుంచి 9,625 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 215.8 టీఎంసీల నిల్వకు గానూ 203.43 టీఎంసీల లభ్యత ఉంది. మరో 12.38 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 52,375 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండటంతో పాటు మరింత నీరు చేరే అవకాశాలుండటంతో మూడు నాలుగు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నిండిన పక్షంలో విడుదలచేసే నీరంతా దిగువ సాగర్‌కే రానుంది. ప్రస్తుతం సాగర్‌లో 147.46 టీఎంసీల నిల్వలున్నాయి. కాగా, మరో 164.59 టీఎంసీలు వస్తేనే ప్రాజెక్టు నిండుతుంది. అయితే శ్రీశైలానికి స్థిరంగా కొనసాగుతున్న ప్రవాహాలు, పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో మున్ముందు నీటి నిల్వలు పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

తాగు, సాగు అవసరాలకు 103 టీఎంసీలు
జూన్‌ మొదలు ప్రస్తుత అక్టోబర్‌ వరకు ప్రవాహాలు లేని కారణంగా ఖరీఫ్‌ లో సాగర్‌ కింద ఒక్క ఎకరాకూ సాగు నీరందలేదు. అయితే ప్రస్తుతం ఎగువన ప్రాజెక్టులు నిండటం, దిగువకు ప్రవా హాలు వస్తున్న నేపథ్యంలో రబీపై ఆశలు పెరిగాయి. ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నిల్వ, వస్తున్న ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని నీటి పారుదల శాఖ వచ్చే జూలై వరకు ప్రాజెక్టు కింద అవసరాలపై అంచనా లెక్కలను సిద్ధం చేసింది. వాటిని సోమవారం కృష్ణా బోర్డుకు అందించ నుంది. శ్రీశైలం, సాగర్‌ల నుంచి తెలం గాణకు సాగు, తాగు నీటికోసం 103 టీఎంసీల కేటాయింపులు కోరుతున్న రాష్ట్రం, అందులో కల్వకుర్తి కోసం 6 టీఎంసీలు మినహా, సాగర్‌కింది తాగు, సాగు అవసరాలకే 97 టీఎంసీలు అడు గుతోంది. ఇందులో నల్లగొండ జిల్లా పరిధిలోని కెనాల్‌ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాల రబీ అవసరాలకు 34.50 టీఎంసీలు కోరగా, ఖమ్మం జిల్లాలో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో 20 టీఎంసీలు కేటాయించాలని కోరుతోంది. నిజానికి సాగర్‌ ఎడమ కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఇంతవరకు చుక్క నీటిని వినియోగించలేదు. ఈ నేపథ్యంలో రబీలో తప్పక కేటాయింపులు జరుగుతా యని రాష్ట్రం అంచనా వేస్తోంది. సాగర్‌ ఎడమకాల్వ కింది 6 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరిచ్చేలా ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement