‘కృష్ణా’ లెక్క తేలకుండానే..! 

Krishna River Management Board Meeting Postponed - Sakshi

వాయిదా పడిన కృష్ణా బోర్డు భేటీ

15 రోజుల్లో మరోమారు భేటీకి నిర్ణయం

ప్రస్తుత నీటి వాటాలు అంగీకరించేది లేదన్న తెలంగాణ

టెలిమెట్రీపై ప్రత్యేక భేటీకి బోర్డు సుముఖం

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నీటి వాటాల నిర్ణయంపై కృష్ణా బోర్డు ఏమీ తేల్చలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న నీటి వాటాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ తేల్చిచెప్పడంతో దీనిపై మరోమారు సమావేశమై నిర్ణయిస్తామని తెలిపింది. టెలిమెట్రీ అంశంపైనా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్న బోర్డు.. ఎప్పటిలోగా పరికరాలు ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. నీటి వాటాలు, టెలిమెట్రీలపై 15 రోజుల్లోనే మరోమారు సమావేశమై చర్చిద్దామంటూ సమావేశం ముగించింది. కృష్ణా బేసిన్‌ వివాదాలపై చర్చించేందుకు బుధవారం జలసౌధలో కృష్ణా బోర్డు ప్రత్యేకంగా భేటీ అయింది. బోర్డు చైర్మన్‌ హెచ్‌కే సాహూ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషి ,ఏపీ నుంచి జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు నాగేంద్రరావు, వెంకటేశ్వరరావు, తెలంగాణ సీఈలు సునీల్, ఖగేందర్, డీసీఈ నరహరిబాబు తదితరులు హాజరయ్యారు. ఎజెండాలో పేర్కొన్న అన్ని అంశాలపై 4 గంటల పాటు చర్చించారు.  

టెలిమెట్రీ ఆలస్యంపై చర్చ 
టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ సీఎస్‌ ఎస్‌కే జోషి.. వీటి ఏర్పాటుపై రెండేళ్ల కిందటే నిర్ణయం జరిగినా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో చెప్పాలన్నారు. ఏర్పాటు చేసిన వాటిలోనూ అనేక లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. టెలిమెట్రీ వ్యవస్థ లేక పోతిరెడ్డిపాడు కింద ఏపీ అధికంగా వినియోగం చేస్తోందని, శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదలైన నీటిలో 44 టీఎంసీల మేర లెక్కలోకి రాకుండా పోయిందని వివరించారు. దీనిపై కల్పిం చుకున్న బోర్డు 15 రోజుల్లో సింగిల్‌ ఎజెండాతో టెలిమెట్రీపై సమావేశం ఏర్పాటు చేస్తామంది. పోతిరెడ్డిపాడు వద్ద కొత్తగా సైడ్‌ లుకింగ్‌ సెన్సార్‌లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనపైనా చర్చిద్దామంది. లెక్కల్లోకి రాని 44 టీఎంసీలపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో అధ్యయనం చేయిస్తామని హామీ ఇచ్చింది. తాగునీటి వినియోగాన్ని 20%గానే లెక్కించాలని తెలంగాణ కోరగా పరిశీలిస్తామని బోర్డు తెలిపింది. ఇక కృష్ణా బోర్డు మాజీ చైర్మన్‌ వైకే శర్మ తయారు చేసిన బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ను ఆమోదించేందుకు తెలంగాణ నిరాకరించింది. అపెక్స్‌ భేటీ, నీటి వాటాల పంపకాలు, ప్రత్యేక అధికారాల అంశాలను తొలగిస్తే వర్కింగ్‌ మాన్యువల్‌కు ఓకే చెబుతామంది. ఇటీవలి గోదా వరి బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ మాదిరిగా కొత్త మాన్యువల్‌ రూపొందించాలని కోరగా బోర్డు ఓకే చెప్పింది.

వాటా నిష్పత్తి మార్చాలన్న తెలంగాణ
ప్రస్తుత వాటర్‌ ఇయర్‌ నుంచి నీటి వాటాలు ఏ నిష్పత్తిన పంపిణీ చేసుకోవాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటివరకు ఇరు రాష్ట్రాలకు ఉన్న కేటాయింపుల (66:34 నిష్పత్తి) ప్రకారం ఏపీ, తెలంగాణలకు పంచుతామంటే ఒప్పుకోమని తెలంగాణ స్పష్టం చేసింది. సాగర్, శ్రీశైలంకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపుల ప్రకారం నీటిని పంచాలని కోరింది. ఈ లెక్కన ఇరు రాష్ట్రాలకు సమానంగా 50:50 నిష్పత్తిన నీటి వాటాలు వస్తాయని వివరించింది. దీనిపై అభ్యంతరం తెలిపిన ఏపీ.. ఈ వాటాలతో తమకు నష్టం జరుగుతుందని పేర్కొంది. దీంతో కల్పించుకున్న బోర్డు.. వాటాల వివరాలను వారం రోజుల్లో ఇరు రాష్ట్రాలు లిఖిత పూర్వకంగా తెలియజేస్తే నిర్ణయిస్తామంది. అలాగే ఇరు రాష్ట్రాలు తాము కోరిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డు మరోమారు విన్నవించింది. కొత్త ప్రాజెక్టులేవీ లేవని తెలంగాణ స్పష్టం చేయగా, ఉన్న వాటి డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డు కోరింది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. దీంతో పాటే జల విద్యుత్‌ను సమానంగా పంచుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top