కొండంత విషాదం: వెంటీలెటర్‌పై మరో నలుగురు

kondagattu bus accident, Four Injured situation is still critical - Sakshi

సాక్షి, జగిత్యాల/హైదరాబాద్‌ : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరింది. మరోవైపు హైదరాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో తీవ్రంగా గాయపడిన పలువురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని సన్‌షైన్‌ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

హెచ్చార్సీలో ఫిర్యాదు
కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి బాద్యులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన హెచ్చార్సీని కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రెషియా ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ కమిషన్‌ను అభ్యర్థించారు.

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం
ఆర్టీసి అధికారుల నిర్లక్ష్య కారణంగానే కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిందని, ఇలాంటి రోజు మళ్లీ రాకూడదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. అధికారులు చేసిన తప్పిదాల వల్ల పేదల కుటుంబాలు బలి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరు చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు.

బుధవారం కరీంనగర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్‌, హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్‌ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top