విప్లవాత్మక మార్పులు కేసీఆర్‌ ఘనతే

KCR is credited with bringing changes in agriculture - Sakshi

రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయంలో విత్తన, ఎరువు ల డీలర్ల శిక్షణ తరగతులు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నా.. ఇక్కడి రైతులు వర్షాల కోసం మొఖాలు మొగుళ్ల వైపుపెట్టి చూడాల్సిన దుస్థితి. మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత కేసీఆర్‌ చూపంతా రైతుల సంక్షేమం మీదనే ఉంది’ అని హరీశ్‌ అన్నారు.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చూడాలన్న తపనతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సాగునీటి వనరులు పెంచామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే చెరువుల్లో జల కళ వస్తుందని చెప్పారు. రైతు బంధు పథకం చరిత్రాత్మక నిర్ణయంగా నిలిచి పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకానికి ఐక్యరాజ్య సమితి కూడా కితాబు ఇవ్వడం తెలంగాణకే గర్వకారణం అన్నారు.

పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, డిమాండ్‌ రేటుకు పంటలను అమ్ముకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన మరో కార్యక్రమంలో మాట్లాడుతూ, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరగాలన్నదే ప్రభుత్వం తపన అన్నారు. అందుకోసం మెరుగైన వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఇప్పటికే కేసీఆర్‌ కిట్, అమ్మఒడి పథకాలు మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top