రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ

Jeevan Reddy takes oath as MLC - Sakshi

కాంగ్రెస్‌ లేకుండా చేయాలనుకోవడం కేసీఆర్‌ వల్ల కాదు: ఉత్తమ్‌

పోరాడుతాం తప్ప.. కేసీఆర్‌ ముందు మోకరిల్లేది లేదన్న భట్టి

కొన్నాళ్లు పోతే కేసీఆర్‌ను కుక్కలు కూడా కానవని విమర్శ

గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అభినందన సభ

సాక్షి, హైదరాబాద్‌: అక్రమంగా సంపాదించిన సొమ్ముతో టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిని చేపట్టిన కేసీఆర్‌ అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాష్ట్రాన్ని తన కుటుంబం మాత్రమే పాలించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది.

ఈ సభలో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో సంబంధాలుండి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం కాంగ్రెస్‌ భవిష్యత్‌కు మలుపు అని అన్నారు. మండలిలో జీవన్‌రెడ్డి తెలంగాణ ప్రజల గొంతుక కావాలని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన పనిచేయాలని కోరారు. నాడు టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలతో కలసి మండలిలో సీఎల్పీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించే చిల్లర రాజకీయాలకు పాల్పడిన కేసీఆర్‌.. ఇప్పుడు అసెంబ్లీలో సీఎల్పీని విలీనం చేస్తానంటూ వికృత క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎదుర్కొంటామని, పోరాడుతామని ఉత్తమ్‌ చెప్పారు.

రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్‌గా భావిస్తున్నారు...
కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ లేకుండా చేయడం కేసీఆర్‌ తరం కాదని, తమ పార్టీ నుంచి జీవన్‌రెడ్డిలు పుడుతూనే ఉంటారన్నారు. తెలంగాణలో అత్యంత అవమానకర రాజకీయ పరిస్థితులున్నాయని, రాష్ట్రాన్ని కేసీఆర్‌ సొంత ఎస్టేట్‌గా భావిస్తున్నారని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ తిరిగి బీఫారాలు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసి చేయి గుర్తు మీద గెలిచారు. గెలిచాక పార్టీ మీద భరోసా లేదంటూ పార్టీని వీడి వెళుతున్న వారిని ఏమనాలి? పార్టీ మీద భరోసా లేనప్పుడు ఎందుకు టికెట్‌ అడిగారు.. పోటీ చేసి ఎలా గెలిచారు? ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు.’అని భట్టి వ్యాఖ్యానించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలితే అంతమందితో పోరాడతామే తప్ప కేసీఆర్‌ ముందు మోకరిల్లబోమని అన్నారు. కొన్నాళ్లు పోతే కేసీఆర్‌ను కుక్కలు కూడా కానని పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. మేధావులు, విద్యావంతులు తనపై నమ్మకం ఉంచి గెలిపించార ని, దాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజల పక్షాన మండలిలో గళం వినిపిస్తానన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవ హారా ల ఇన్‌చార్జీ కుంతియా, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ తదితరులు ప్రసంగించిన ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

చీఫ్‌ కో–ఆర్డినేటర్‌గా జీవన్‌రెడ్డి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గాను రాష్ట్ర చీఫ్‌ కో–ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ గెలుపు కోసం ఆయన సమన్వయం వహిస్తారని పేర్కొన్నారు.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top