కేసీఆర్‌కు చెంచాగిరీ చేస్తున్నారు: జగ్గారెడ్డి

Jagga Reddy Slams KCR Govt Over TSRTC Employees Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో ఉద్యమాలకు విలువ లేకుండా పోయిందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లున్నా చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇది అని కేసీఆర్‌ సర్కారుపై ధ్వజమెత్తారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... 40 రోజులు ఆర్టీసీ సమ్మె జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ‘ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. తక్కువ జీతాలు ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఈరోజు కూడా ఆవుల నరేశ్‌ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.  ఇంకా ఎన్నిరోజులు సమ్మె కొనసాగుతుందో తెలియం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పలు సందర్భాలలో మాట్లాడారు. మరి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఒకవైపు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు మరోవైపు. ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గనపించడం లేదా’ అని ప్రభుత్వ తీరును విమర్శించారు.

వారి కుటుంబాలను ఆదుకోవాలి..
‘రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా... గుండెపోటు తెలంగాణగా మారింది. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడా కనపడటం లేదు. కేవలం సీఎం కేసీఆర్ మాటలను బలపరుస్తున్నారు. స్వామిగౌడ్ , మమత, రవీందర్, దేవీప్రసాద్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై మాట్లాడకుండా ప్రభుత్వానికి చెంచా గిరి చేసుకుంటూ బతుకుతున్నారు’ అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ సమ్మెను బలహీనుడికి.. బలవంతునికి జరుగుతున్న పోరాటంగా అభివర్ణించిన ఆయన... భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూద్దామని వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top