పౌష్టికాహారం కష్టమే! | insufficient nutrition supply to welfare hostels | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారం కష్టమే!

Jul 28 2014 2:51 AM | Updated on Jul 11 2019 5:40 PM

వసతి గృహాల విద్యార్థులకు ఇది చేదు వార్తే. సంక్షేమాధికారుల విన్నపాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ మన్నిస్తే, మార్పు చేసిన మెనూ వెంటనే అమలులోకి వస్తుంది.

ఇందూరు: వసతి గృహాల విద్యార్థులకు ఇది చేదు వార్తే. సంక్షేమాధికారుల విన్నపాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ మన్నిస్తే, మార్పు చేసిన మెనూ వెంటనే అమలులోకి వస్తుంది. విద్యార్థులకు అరకొరగానే పౌష్టికాహారం అందుతుంది. జిల్లాలో ఎస్సీ 67, ఎస్టీ 13, బీసీ 42, మొత్తం 122 ప్రభుత్వ సంక్షేమ వసతిగృహలున్నాయి. ఒక్కో వసతి గృహంలో 50 నుంచి 80 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు వార్డెన్‌లకు ఇబ్బందిగా మారాయి.

గుడ్లు, అరటి పండ్ల సరఫరాకు ఏజేన్సీలు లేకపోవడంతో వార్డెన్‌లే తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం గతంలో సూచించింది. నెల నెలా బిల్లులు సమర్పిస్తే నిధులు మంజురు చేస్తామని చెప్పడంతో జిల్లాలోని అందరు వార్డెన్‌లు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టి గుడ్లు, అరటి పండ్లు కొంటున్నారు. ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే నిధులు మాత్రం పెరగడంలేదు.

 ప్రస్తుతం ఒక గుడ్డు చిల్లర ధర రూ.4.50 నుంచి రూ.5 వరకు పలుకుతోంది. ఇటు అరటి పండ్లు డజనుకు రూ.45 నుంచి 50 వరకు ఉంది. ప్రభుత్వం మాత్రం పాత ధరలకు తగ్గట్టుగానే నిధులును మంజురు చేస్తోంది. గుడ్డుకు రూ.3.75 పైసలు, అర టి పండుకు రూ. 3.50 పైసలు మాత్రమే అందిస్తోంది. ఫలితంగా తాము నష్టపోతున్నామని వార్డెన్‌లు పేర్కొంటున్నారు. ఈపాటికే వార్డెన్‌లు పాత మెనూలోనే అనాధి కారికంగా కోతలు విధించారన్న ఆరోపణలు ఉన్నాయి.

 ఆరు నుంచి ఐదు రోజులకు
 గతంలో వారానికి ఆరు రోజులు విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు పెట్టేవారు. ఇపుడు ఐదు రోజులే అందించనున్నారు. ఈ లెక్కన చూస్తే నెలకు నాలుగు, ఏడాదికి 48 గుడ్లు, అరటిపండ్లు విద్యార్థులకు దూరం అవుతున్నాయి. వీటిని ఇవ్వనిరోజు స్నాక్స్, బఠానీలు, అల్పాహారం పెడుతామని సంక్షేమాధికారులు చెబుతున్నారు.

 కూరగాయల భోజనం దూరం
 వారంలో ఒక రోజు పౌష్టికాహారం గుడ్డు, అరటి పండు విద్యార్థులకు దూరమౌతుంటే, ఇటు రుచికరమైన భోజనమూ అందటంలేదు. టమాట ధర కిలో రూ.80లకు చేరగా పచ్చి మిర్చి కిలో రూ.60కి చేరింది. ఉల్లి, బెండకాయ ధరలు కూడా ఆకాశాన్నంటాయి. పప్పులు, నూనెల ధరలు కూడా అదే దారిలో ఉన్నాయి. పప్పు, కూరగాయల భోజనం తప్పనిసరికావడంతో తక్కువ నాణ్యతతో కూడిన భోజనం వండి విద్యార్థులకు పెడుతున్నారు. నీళ్ల పప్పు అన్నంతోనే సరిపెడుతున్నారు. కూరగాయల స్థానంలో దోస, సోరకాయ, వంకాయ వండుతున్నారు. అసలైన కూరగాయల భోజనం చేయక చాలరోజులవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement