శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ ముందంజ 

India is leading in science and technology - Sakshi

కేంద్రమంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌  

వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు కృతనిశ్చయంతో కృషి 

ప్రగతినగర్‌లో ట్రెయినింగ్‌ సెంటర్‌ ఫర్‌ ఆపరేషనల్‌ ఓషనోగ్రఫీ కేంద్రం ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు మనదేశం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ప్రపంచదేశాలు అంగీకరించిన ప్యారిస్‌ ఒప్పందాన్ని అమలు చేయడంలో అందరికంటే ముందు ఉందని కేంద్ర పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. విద్యుత్తు వాహనాల వినియోగం మొదలుకుని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తులు చేయడం వరకూ అనేక అంశాల్లో భారత్‌ తనకు తానుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను అధిగమించి ముందుకు వెళుతోందని అన్నారు. శనివారం హైదరాబాద్‌ ప్రగతినగర్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌)లో ఇంటర్నేషనల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌ ఫర్‌ ఆపరేషనల్‌ ఓషనోగ్రఫీ కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు.

మహాసముద్రాలపై అధ్యయనం చేసే వారి శిక్షణార్థం ఈ కేంద్రాన్ని ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు భారత్‌ నిర్మించింది. మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారతదేశం మునుపెన్నడూ లేనంత వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. పరిశోధనా వ్యాసాల ప్రచురణలో ప్రపంచ సగటు వృద్ధి కేవలం నాలుగు శాతమే ఉండగా, భారత్‌లో అది 14 శాతం వరకూ ఉందని వివరించారు. అలాగే, ఇన్‌కాయిస్‌ పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు దేశీయ జాలర్లు చేపలవేటకు సముద్రాలపై గడపాల్సిన సమయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. సముద్ర ప్రాంతంలో చేపల వేటకు ఉపయోగించే వాహనాలు, పడవల డీజిల్‌ 60 నుంచి 70 శాతం ఆదా అవుతోందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఇన్‌కాయిస్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ టూల్‌ ద్వారా కోస్ట్‌గార్డు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు సులభతరమయ్యాయన్నారు.  

ఇన్‌కాయిస్‌తో 25 దేశాలకు లబ్ధి 
ఇన్‌కాయిస్‌లో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా హిందూ మహాసముద్ర తీరంలోని 25 దేశాలు లబ్ధి పొందుతున్నాయని హర్షవర్ధన్‌ అన్నారు. వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేయడంలో భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉందని వివరించారు. 2004లో సునామీ భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇన్‌కాయిస్‌లో ఏర్పాటు చేసిన సునామీ హెచ్చరిక కేంద్రంతో నేడు సునామీని ముందస్తుగా గుర్తించే వీలు కలిగిందన్నారు. హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ ద్వారా వాతావరణ వివరాలను సకాలంలో అందజేసేందుకు కూడా ఇన్‌కాయిస్‌ పరిశోధనలు సాయపడ్డాయని చెప్పారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరిట నిర్మించిన ‘అటల్‌ అతిథిగృహ’ను కేంద్రమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ 0శాఖ కార్యదర్శి రాజీవ్‌ నాయర్, ఇన్‌కాయిస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సతీశ్‌ షెనాయ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top