దుబ్బాక నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మండలానికో స్పెషల్ అధికారిని నియమించాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు.
మిరుదొడ్డి, న్యూస్‌లైన్ : దుబ్బాక నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మండలానికో స్పెషల్ అధికారిని నియమించాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి తొలిసారిగా మంగళవారం మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ పథకాల అమలుకోసం స్పెషల్ అధికారులను నియమించినట్లుగానే కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించడానికి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుకు మద్దతు ధర కల్పించేలా ప్రోత్సాహించాలని కోరారు.
సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలి
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక ముందే రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలను సరఫరా చేయాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధికారులను కోరారు. నియోజకవర్గంలోని సాగు విస్తీర్ణతను బట్టి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త వహించాలని సూచించారు.కార్యక్రమంలో ఆయన వెంట పంజాల శ్రీనివాస్‌గౌడ్, లింగాల బాల్‌రెడ్డి, అందె సర్పంచ్ బుర్ర లింగంగౌడ్, గంగాధర్ గౌడ్, నంట బాపురెడ్డి, ఏవీ రవీందర్ తదితరులు ఉన్నారు.