జాయ్‌ఫుల్‌ జర్నీ

Hyderabad Metro Train Starts Sugar Box Network Services - Sakshi

మెట్రో రైళ్లలో షుగర్‌బాక్సునెట్‌వర్క్‌

జీ 5, ఫ్రీ ప్లే మొబైల్‌యాప్‌ల ద్వారా సదుపాయం

ఇప్పటి వరకు 75 వేల మంది డౌన్‌లోడ్‌

దేశంలోనే ఈ తరహా సేవలు నగరంలో మొదటిసారి

మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాలు మొదలుకొని నచ్చిన పాటలను, వినోద కార్యక్రమాలను ఆస్వాదించాలనుకుంటున్నారా...అయితే మెట్రో రైలు ఎక్కేసేయండి. నిజమే. మెట్రోలో ప్రయాణం చేసినంత సమయం నచ్చిన సినిమాలు  వీక్షించడమే కాదు. వాటిని మొబైల్‌ ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు కూడా. ఆహ్లాదభరితమైన మెట్రో ప్రయాణాన్ని మరింత ఆనందభరితం,  వినోదభరితం చేసే సదుపాయాన్ని మొట్టమొదటిసారి అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌ మెట్రో రైల్‌. షుగర్‌ బాక్సు నెట్‌వర్క్‌ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇంటర్నెట్‌తో నిమిత్తం లేకుండా లోకల్‌ వైఫై సదుపాయం ద్వారా ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లలో నచ్చిన సినిమాలు, వినోద కార్యక్రమాలను వీక్షించే అద్భుతమైన సదుపాయాన్ని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. షుగర్‌ బాక్సు సీఈవో రోహిత్‌ పరంజిపే,ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీబీ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.

మొదట నగరంలోని 9 మెట్రో స్టేషన్‌లు  నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, జేఎస్‌టీయూ, మియాపూర్‌లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లలో ‘జీ 5’ లేదా ‘ఫ్రీ ప్లే’ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని ఈ వినోదభరితమైన ప్రయాణాన్ని  ఎంజాయ్‌ చేయవచ్చు. అంతేకాదు..నచ్చిన సినిమాలను కేవలం 3 నిమిషాల్లో డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం 9 స్టేషన్‌లలో ఈ సదుపాయాన్ని  ప్రారంభించినప్పటికీ త్వరలో నగరంలోని అన్ని స్టేషన్‌లకు విస్తరించనున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. కేవలం  సినిమాలు, వినోదం వంటి కార్యక్రమాలే కాకుండా ప్రయాణికులు తమ అభిరుచికి తగిన పుస్తకాలను చదువుకొనేందుకు, మేధో సంపత్తిని పెంచుకొనేందుకు ఈ యాప్‌ ద్వారా ఒక లైబ్రరీని అందుబాటులోకి తేవాలని ఆయన షుగర్‌ బాక్సు నెట్‌ వర్క్‌ ప్రతినిధులకు సూచించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, తదితర అన్ని వర్గాల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెట్రో సేవలను మరింత అభివృద్ధిచేయనున్నట్లు  తెలిపారు. 

5 వేల సినిమాలతో షుగర్‌ బాక్సు
షుగర్‌ బాక్సు నెట్‌ వర్క్‌ ద్వారా 5 వేలకు పైగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ మూవీలు, హాస్యంతో కూడిన వినోద కార్యక్రమాలు, ప్రీమియర్‌ షోలు, పాటలు, గేమ్స్, తదితర అన్ని కార్యక్రమాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు తమ స్మార్ట్‌ ఫోన్‌లలో జీ 5, లేదా  ఫ్రీ ప్లే యాప్‌లను  డౌన్‌లోడ్‌ చేసుకొని ఒకసారి ఫోన్‌ నెంబర్, ఇతర వివరాలను నమోదు చేసుకొంటే చాలు. రైలు ఎక్కిన వెంటనే లోకల్‌ వైఫై ద్వారా  నచ్చిన సినిమాలను చూడవచ్చు. కొత్త మొబైల్‌ ఫోన్‌లలో కేవలం 3 నిమిషాల్లో ఒక సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాతవాటిలో అయితే  15 నిమిషాల వరకు సమయం పట్టవచ్చునని షుగర్‌ బాక్సు సీఈవో రోహిత్‌ తెలిపారు. గత 3 నెలలుగా చేపట్టిన ప్రచార కార్యక్రమాల వల్ల 75 వేల మందికి పైగా  ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు పేర్కొన్నారు.  ఆ ప్రయాణికులంతా ప్రస్తుతం నచ్చిన మూవీలు చూడొచ్చు. మొదటి 60 రోజులు పూర్తిగా ఉచితంగా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు. ఆ తరువాత రూ.80 నుంచి రూ.100 వరకు నెలవారీ రుసుముతో సినిమాలు, వినోద కార్యక్రమాలను పొందవచ్చునని తెలిపారు. 

జనవరి నెలాఖరులో జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం  
షుగర్‌ బాక్సు నెట్‌ వర్క్‌  ప్రారంభం అనంతరం ఎన్వీఎస్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, జనవరి నెలాఖరుకు జూబ్లీబస్‌స్టేషన్‌– మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ల మధ్య మెట్రో రైల్‌ సేవలను  ప్రారంభించనున్నట్లు  తెలిపారు. ప్రస్తుతం 4 లక్షల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారని  చెప్పారు. ఆర్టీసీ సమ్మె రోజుల్లో 70 వేల మంది ప్రతి రోజు అదనంగా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. రాయదుర్గం స్టేషన్‌ ప్రారంభించడంతో మరో 20 వేల మంది అదనంగా మెట్రో రైళ్లలో పయనిస్తున్నట్లు ఎండీ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top