హోరెత్తిన హుజూర్‌నగర్‌

Huzurnagar Nominations Process Ended - Sakshi

ముగిసిన నామినేషన్ల పర్వం

76 మంది అభ్యర్థులు.. 119 నామినేషన్లు

బరిలో ఎంతమందో 3న తేలనునుంది 

సాక్షి, సూర్యాపేట: చివరి రోజు నామినేషన్లతో హుజూర్‌నగర్‌ హోరెత్తింది. రాజకీయ పార్టీలతో పాటు, సతంత్ర అభ్యర్థులు, నిరుద్యోగ జేఏసీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి హుజూర్‌నగర్‌ అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నేతలు, కేడర్‌తో జనసంద్రమైంది. పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోస్తు చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నోటిఫికేషన్‌ విడుదలైన గత నెల 23 నుంచి చివరి రోజు వరకు మొత్తం 76 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు వేశారు. ఇందులో కొంతమంది అభ్యర్థులవి రెండు, మూడు నామినేషన్‌ సెట్లు ఉన్నాయి.  

తరలివచ్చిన ముఖ్యనేతలు.. 
తమ పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ముఖ్య నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నలమాద పద్మావతిరెడ్డి నామినేషన్‌ వేశారు. ఆపార్టీ సాయంత్రం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సలీంఅహ్మద్, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  శానంపూడి సైదిరెడ్డి వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావులు వెళ్లి నామినేషన్‌ వేయించారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కోటరామారావు నామినేషన్‌ వేయడానికి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, స్థానిక నేతలు హాజరయ్యారు. సీపీఎం అభ్యర్థిగా పారేపల్లి శేఖర్‌రావు, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా మేడి రమణ, టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మాన్‌ మల్లన్న నామినేషన్లు వేశారు.  నామినేషన్ల తీరును ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్‌ అమయ్‌కుమార్‌లు దగ్గరుండి పరిశీలించారు.  

బరిలో ఉండేది ఎంతమందో.. 
76 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయడంతో బరిలో ఉండేది ఎంత మందో ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణతో తేలనుంది. ప్రధాన పార్టీలతో పాటు.. చిన్నాచితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా చాలా మంది నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికపై జోరుగా చర్చ జరుగుతండడంతో ఎంతమంది నామినేషన్లు వేస్తారన్న చర్చ జోరుగా సాగింది. చివరకు 76 మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తమను నామినేషన్లు వేయనివ్వలేదని సర్పంచ్‌ల ఫోరం సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. 30 మందికి టోకెన్లు ఇస్తే కేవలం ఆరుగురిని మాత్రమే నామినేషన్‌ వేయించారని, అందులో నలుగురివి ఆ పత్రాలు.. ఈ పత్రాలు లేవని తిరస్కరించారని ఆ సంఘం సభ్యులు మీడియా ఎదుట ఆవేదనవ్యక్తంచేశారు. న్యాయవాదులు నామినేషన్లు వేస్తారని ప్రచారం సాగినా.. వారు నామినేషన్లు వేయలేదు. నామినేషన్లే వేసిన 76 మంది అభ్యర్థుల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆమ్‌ ఆద్మీపార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, తెలంగాణ సోషల్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా శంకర్‌చౌహాన్, బహుజన ముక్తి పార్టీ నుంచి శాంతిరాందాస్‌నాయక్, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ సాంబశివగౌడ్‌తో పాటు పలువురు నామినేషన్లు వేశారు.గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వచ్చిన మేకల రఘుమారెడ్డి ఈ సారి కూడా తెలంగాణ రిపబ్లికన్‌ పార్టీ నుంచి నామినేషన్‌ వేశారు.  

కేడర్‌లో జోష్‌.. 
నామినేషన్‌కు ఆయా పార్టీల కేడర్‌ భారీగా తరలివచ్చింది. అభ్యర్థులు నామినేషన్‌కు వెళ్తుండగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ శ్రేణులు నినాదాలు చేశారు. బీజేపీ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. సీపీఎం ఏర్పాటు చేసిన సభకు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. అన్ని పార్టీల నుంచి నామినేషన్లు వేయడం, కేడర్‌ తరలిరావడంతో హుజూర్‌నగర్‌ గతంలో ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేనట్లు పార్టీ జెండాలతో కళకళలాడింది.  

కొయంబత్తూర్‌ నుంచి వస్తే నామినేషన్‌ పోయింది... 
హుజూర్‌నగర్‌కు చెందిన గున్‌రెడ్డి  మాధవరెడ్డిది కొంతకాలంగా మేడ్చెల్‌లో నివాసం  ఉంటున్నారు. ఉద్యోగరీత్యా  తమిళనాడు రాష్ట్రం లోని కొయంబత్తూర్‌కు వెళ్లారు.తన స్వస్థలంలో ఉప ఎన్నిక జరుగుతుండడంతో నామినేషన్‌ వేయాలనుకున్నాడు. ఆదివారం విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నాడు.  అక్కడి నుంచి సాయంత్రం  హుజూర్‌నగర్‌కు చేరాడు. ఓ న్యాయవాది ఇంటికి వెళ్లి నామినేషన్‌ తయారు చేసుకున్నాడు. ఇవన్నీ తీసుకొని ఆదివారం రాత్రి తన  స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా నామినేషన్‌ ఎవరో కొట్టేశారు. అందులో అతని ఒర్జినల్‌ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు  ఉన్నాయి. అయితే  తన నామినేషన్‌ పత్రం, ఒర్జినల్‌ సర్టిఫికెట్లు  ఎవరో కొట్టేయడంతో నామినేషన్‌ వేయలేకపోయానని, దీనిపై కేసు పెట్టానని సోమవారం నామినేషన్‌ కేంద్రం సమీపంలో మీడియా పాయింట్‌  వద్ద ఆవేదనవ్యక్తంచేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top