
ఆశల గూడు
‘గూడు లేని ప్రతి ఒక్క నిరుపేదకూ రూ.3 లక్షలకు పైగా వ్యయంతో 125 గజాల స్థలంలో ఇంటిని నిర్మించి ఇస్తాం. రెండు బెడ్‌రూంలు.. ఒక హాలు.. వంట గదితోపాటు మరుగుదొడ్డి ఉండేలా నిర్మాణాలు చేపడతాం.
- సొంతింటి కోసం పేదల ఎదురుచూపులు
- జిల్లాలో 2,18,000 మంది నిరీక్షణ
- ‘ఇందిరమ్మ ఇళ్ల’పై నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశం
- కసరత్తు మొదలుపెట్టిన అధికారులు
‘గూడు లేని ప్రతి ఒక్క నిరుపేదకూ రూ.3 లక్షలకు పైగా వ్యయంతో 125 గజాల స్థలంలో ఇంటిని నిర్మించి ఇస్తాం. రెండు బెడ్‌రూంలు.. ఒక హాలు.. వంట గదితోపాటు మరుగుదొడ్డి ఉండేలా నిర్మాణాలు చేపడతాం.’ - కేసీఆర్
హన్మకొండ : ఎన్నికల ప్రచార సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇళ్లు లేని పేదోళ్లకు వరం కురిపించారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో గూడు లేని సామాన్యుల్లో కొత్త ఆశలు చిగురిస్తు న్నాయి. సొంతింటి కల సాకారమవుతుందనే గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. వారు ఆశ పడ్డట్లే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది.
ఇదివరకు ఇందిరమ్మ పథకంలో చేపట్టిన ఇళ్లు... పూర్తి కాని నిర్మాణాలు ఎన్ని... ప్రారంభానికి నోచుకోని ఇళ్లు ఎంత వరకు ఉన్నాయి... వంటి అంశాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించి నివేదిక అందజేయూలని జిల్లా యంత్రాంగాన్ని సర్కారు ఆదేశించింది. దీన్ని బట్టి త్వరలో కొత్త ఇళ్లు మంజూరు కానున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్కడే సవాలక్ష సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త రాష్ట్రంలో కొత్త ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వ పాలసీ (విధానం) ఏవిధంగా ఉంటుందో తెలియక లబ్ధిదారులు మదనపడుతున్నారు.
ఎవరికి వర్తించేనో...
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మూడు విడతల్లో పూర్తయిన నిర్మాణాలు జిల్లాలో 2 లక్షలు ఉన్నాయి. మొదటి, రెండో విడతలో గ్రామీణ ప్రాంతంలోని లబ్ధిదారులు ఒక్కొక్కరికి అప్పటి ప్రభుత్వం రూ.45 వేలు... పట్టణ ప్రాంతంలోని వారికి రూ.65 వేలు మంజూరు చేసింది. నిర్మాణ సామగ్రి వ్యయం పెరగడంతో మూడో విడతలో గ్రామాల్లోని ఒక్కో లబ్ధిదారుడికి రూ.65 వేలు... పట్టణంలో అయితే ఒక్కొక్కరికి రూ.లక్ష మంజూరు చేసింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రూ.3 లక్షలకు పైగా వ్యయంతో గూడు లేని పేదలకు ఇల్లు నిర్మిస్తామని టీఆర్‌ఎస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించింది. ఈ లెక్కన ఇందిరమ్మ పథకంలో నిర్మాణాలు పూర్తిఅయిన లబ్ధిదారులకు ఇది వర్తిస్తుందా... వర్తించదా అనే సందేహం నెల కొంది. ఒక వేళ వర్తింపజేస్తే ఎలా సర్దుబాటు చేస్తారు.. నిర్మాణాల మాడిఫికేషన్ ఎలా అనేది చిక్కుముడిగా మారింది.
ఇందిరమ్మ పథకంలో ఇప్పటివరకు ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పాత లబ్ధిదారులకు ఆ స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేస్తారా... లబ్ధిదారులను మళ్లీ ఎంపిక చేస్తారా... అనేది స్పష్టత రాలేదు.
సొంతింటి కోసం రచ్చబండ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారు జిల్లాలో కోకొల్లలు. వాటి పరిశీలన సైతం పూర్తయింది. లభ్ధిదారులు హౌసింగ్ కార్యాలయూలు చుట్ట ప్రదక్షిణలు చేసినా ఇళ్ల మంజూరుకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటారా... మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోమంటారా.. అనేది తెలియడం లేదు.
2,18,000 మంది ఎదురుచూపు...
ఇందిరమ్మ ఇళ్ల పథకం అసలైన నిరుపేదలకు దూరంగానే ఉంది. ప్రభుత్వ ఆర్థిక సాయం ఎటూ సరిపోకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇందిరమ్మ పథకం అమలు కు నోచుకున్న నాటి నుంచి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 4.20 లక్షల ఇళ్లు మంజూరయ్యూయి. వీటిలో పూర్తయిన నిర్మాణాలు 2 లక్షలే. మిగిలిన వాటిలో 97 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో మూలుగుతున్నాయి.
అదేవిధంగా... ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయూలని రచ్చబండ సభల్లో పేదలు పెట్టుకున్న ఆర్జీలకు మోక్షం లేకుండా పోయింది. సుమారు 1.21 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన ప్రారంభానికి నోచుకోని ఇళ్లతో కలిపి ఇప్పటికిప్పుడు 2,18,000 మంది పేదలు సొంతింటి కల సాకారం కోసం సర్కారు వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిలో సుమారు లక్ష మందికి స్థలం కూడా లేదు.
ఇక... సర్కారు సాయం సరిపోక పునాదులు తీసి, గోడలు పెట్టి నిర్మాణాలను మధ్యలోనే ఆపేసిన 1,23,000 మంది సైతం కేసీఆర్ హామీపై ఆశలు పెట్టుకున్నారు. కాగా, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గృహ నిర్మాణ సంస్థ కార్యాకలాపాలకు తాళం పడింది. గత నెల 12వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇంటికి ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించలేదు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో హౌసింగ్ అధికారులు జాబితా పంపించే పనిలో పడ్డారు. లబ్ధిదారుల పూర్తి వివరాలను మరోసారి చెక్ చేసుకుంటున్నారు.