పప్పు.. నిప్పు | Highly increased of Pulses prices | Sakshi
Sakshi News home page

పప్పు.. నిప్పు

May 10 2015 11:49 PM | Updated on Jun 4 2019 6:37 PM

వేసవిలో కూరగాయలు ధరలు చుక్కలనంటడం మామూలే...

- అమాంతం పెరిగిన ధరలు
- ఓవైపు ఎండలు.. మరోవైపు ధరల భగభగ
- కిలో రూ.120కి ఎగబాకిన కంది, పెసర పప్పులు
- పెళ్లిళ్ల సీజన్‌తో కొరత సృష్టించిన వ్యాపారులు
- కొరవడిన అధికారుల నిఘా
- మండిపడుతున్న సామాన్యులు

పప్పుల ధరలు నిప్పులు కురిపిస్తున్నాయి. ఎండలతో పోటీపడుతూ రేట్లు మండిపడుతున్నాయి. వారం రోజుల్లోనే ధరల్లో భారీ వ్యత్యాసం రావడంతో కొనేందుకు సామాన్యులు జంకుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు భారీగా పెంచినట్టు తెలుస్తోంది. అధికారుల నిఘా కొరవడడంతో వ్యాపారుల దోపిడీ సాగుతోందని పలువురు మండిపడుతున్నారు.   

మెదక్ టౌన్: వేసవిలో కూరగాయలు ధరలు చుక్కలనంటడం మామూలే. కానీ ఈసారి పప్పుల ధరలూ అనూహ్యంగా పెరిగాయి. మొన్నటి వరకు కంది పప్పు ధర కిలో రూ.100 ఉండగా ఏకంగా కిలోకు రూ.20 పెరిగింది. వేసవిలో కూరగాయలు కొనలేని సామాన్యులు పప్పుచారుతో సరిపెట్టుకునే వారు. కానీ ఇప్పుడు పప్పులూ అందకుండా పోవడంతో జనం విలవిలలాడుతున్నారు. నెల క్రితం కందిపప్పు కిలో రూ.60 నుంచి 70, పెసర పప్పు ధర రూ.90 నుంచి 100 ఉండగా తాజాగా ఈ రెండు రకాల పప్పుల ధరలు రూ.120కి చేరుకున్నాయి. దీనికితోడు కంది మార్కెట్‌లో లభించడం లేదని వినియోగదారులు అంటున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పప్పులు కొనేందుకూ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత పదేళ్లలో కందిపప్పు ధర ఇంత భారీగా పెరగడం ఇదే మొదటి సారి అని వినియోగదారులు అంటున్నారు. శనగ, మినప పప్పుల ధరలూ పెరిగాయి. మినప పప్పు కిలో రూ.80 నుంచి 90 వరకు ఉండగా ప్రస్తుతం రూ.110కి, శనగ పప్పు రూ.60 ఉండగా రూ.70కి ఎగబాకింది. శనగ పిండి కిలో రూ.50 నుంచి 70కి పెరిగింది. ప్రస్తుతం కూరగాయల ధరలు పెరగడం, పెళ్లిళ్ల  సీజన్ కావడంతో కొంతమంది వ్యాపారులు పప్పుల కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు అమాంతం పెంచేస్తున్నారు. ప్రభుత్వం కృత్రిమ కొరతను నియంత్రించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement