ఫీజు పిడుగు | Higher Education Department Initiative To Increase Degree Fees | Sakshi
Sakshi News home page

ఫీజు పిడుగు

Feb 14 2019 2:07 AM | Updated on Feb 14 2019 5:22 AM

Higher Education Department Initiative To Increase Degree Fees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకే రాష్ట్రం.. ఒకే డిగ్రీ కోర్సు.. అయినా ఫీజులు మాత్రం ఒక్కో వర్సిటీలో ఒక్కో రకంగా ఉన్నాయి. అంతేకాదు యాజమాన్యాలు కూడా ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీల బీఏ కోర్సుకు తక్కువ ఫీజు ఉంటే.. మరికొన్నింటిలో ఎక్కువ ఫీజులున్నాయి. ఈ మోతను నియంత్రించాల్సింది పోయి.. మరోభారీ ఫీజు వడ్డనకు ఉన్నతవిద్యామండలి సిద్ధమైంది. అన్ని వర్సిటీల్లో ఒకేరకమైన ఫీజు విధానం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇందులో సమస్యేముంది అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజు సమం పేరిట ఒక్కో కోర్సుపై రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని డిగ్రీలో చేరుతున్న 2.20 లక్షల మంది విద్యార్థులపై ఫీజుల భారం తప్పేట్లు లేదు. 

డిగ్రీకి పేదలు దూరమే! 
కాకతీయ యూనివర్సిటీలో బీఏ కోర్సు వార్షిక ఫీజు ప్రస్తుతం రూ.6,170. ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నట్లు కనీసం రూ.5వేల పెంచితే అది రూ.11,170కి చేరుతుంది. అదే రూ.10వేలు పెంచితే ఫీజు కాస్తా రూ.16,170గా ఉండనుంది. అదే ఏటా రూ.13,520 ఉన్న బీఎస్సీ వంటి కోర్సుల్లో ఈ పెంపును వర్తింపజేస్తే.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు డిగ్రీ చదువులకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటివరకు ఉన్న తక్కువ ఫీజుతో గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. పెంచిన ఫీజులు అమల్లోకి వస్తే.. పేదలకు ఉన్నత విద్య ఇక నెరవేరని కలగా మారడం ఖాయమే. 

 
యాజమాన్యాల ఒత్తిడితోనే.. 
డిగ్రీ కాలేజీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే.. ఉన్నతాధికారులు ఈ ఫీజుల పెంపు ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఫీజుల పెంపు ద్వారా యాజమాన్యాలకు మేలు చేకూర్చేందుకు మండలిలోని కొంతమంది ఉన్నతాధికారులు పావులు కదిపినట్లు తెలిసింది. అందులో భాగంగానే కామన్‌ ఫీజు చేస్తామనే సాకుతో.. అన్ని వర్సిటీల పరిధిలోకి ఒకే రకమైన ఫీజు విధానం తీసుకురానున్నట్లు తెలిసింది. 
 
తల్లిదండ్రులపై ఫీజు పెంపు భారం! 
సాధారణంగా డిగ్రీలో చేరుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. అయితే ఇపుడు కామన్‌ ఫీజు అమల్లోకి తెచ్చి అదనంగా పెంచే మొత్తాన్ని విద్యార్థులనుంచే వసూలు చేసేలా నిబంధనను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా విద్యార్థు«లకు, తల్లిదండ్రులకు తాము కొంత ఫీజు చెల్లిస్తాం కనుక డిగ్రీ చదువులపై శ్రద్ధ పెరుగుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఉన్న యూనివర్సిటీ ఫీజుకు అదనంగా ఒక్కో విద్యార్థిపై రూ.10 వేల వరకు వసూలు చేసుకునేలా రెండేళ్ల కిందటే ఆదేశాలు జారీ అయ్యాయి. పెంచిన ఫీజు మొత్తం ఫీజు–రీయింబర్స్‌మెంట్‌ పరిధిలో రాదు. తల్లిదండ్రులే చెల్లిస్తున్నారు. అదే తరహాలో ఇపుడు అన్ని యూనివర్సిటీల్లో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఫీజులను పెంచి తల్లిదండ్రులపై భారం మోపాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. త్వరలోనే జరిగే డిగ్రీ ప్రవేశాల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి అధికారికంగా ప్రకటించనుందని తెలిసింది.  
రాష్ట్రంలోని 1,084 డిగ్రీ కాలేజీల్లో 4.20లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 2.20 లక్షలకు మించి భర్తీ కాలేదు. ఐదారేళ్లుగా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫీజులు పెంచితే మరిన్ని ఖాళీలు తప్పవు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement