
మీది ‘చెత్త’ ఐడియానే..!
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ‘చెత్త ఐడియా’ పై హైకోర్టు మండిపడింది.
ఆస్తి పన్ను చెల్లించని వారి ఇంటి ముందు చెత్త డబ్బాలు పెడతారా..?
జీహెచ్‌ఎంసీ నిర్ణయంపై హైకోర్టు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ‘చెత్త ఐడియా’ పై హైకోర్టు మండిపడింది. ఆస్తి పన్ను చెల్లించని వారి ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాల ముందు జీహెచ్‌ఎంసీ అధికారులు చెత్త డబ్బాలను ఉంచడాన్ని తప్పు పట్టింది. ఈ చర్యను అనాగరికమైనదిగా పేర్కొంది. వెంటనే చెత్త డబ్బాలను తొలగించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఆస్తి పన్ను చెల్లించలేదంటూ తన దుకాణం ముందు జీహెచ్‌ఎంసీ అధికారులు చెత్త డబ్బాను ఉంచడాన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన అనిల్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఆస్తి పన్ను వసూలకు ప్రత్యామ్నాయాలు ఏమీ లేవా..? అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. నగరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన మీరే చెత్త డబ్బాలను దుకాణాల ముందు ఉంచుతారా అని నిలదీసింది. ఇలా చేయాలని ఏ చట్టం చెబుతోందంటూ అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్ దుకాణం ముందుంచిన డబ్బాను గంటలోపు తొలగించకపోతే కమిషనర్, ఇతర అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని స్పష్టం చేస్తూ విచారణను గంటకు వాయిదా వేసింది. గంట తరువాత కేసు విచారణకు రాగా, పిటిషనర్ దుకాణం ముందున్న డబ్బాను తొలగించేందుకు చర్యలు చేపట్టామని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం కేసు విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.