కాళేశ్వరం పరిధిలో 17 చోట్ల హెలిప్యాడ్‌లు 

Helipads in 17 places in Kaleshwaram range - Sakshi

ప్రతి పంప్‌హౌస్, బ్యారేజీల వద్ద నిర్మాణం 

ప్రతిచోటా స్టాఫ్‌ క్వార్టర్స్, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ  

రూ. 44.53 కోట్ల వ్యయం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మిస్తున్న బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల పరిధిలో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయాచోట్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా వాటిని వీలైనంత వేగంగా చక్కదిద్దేందుకు, అవసరమైన సిబ్బందిని తరలించేందుకు వీలుగా హెలిప్యాడ్‌ల నిర్మాణం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ప్రాజెక్టు ఇంజనీర్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌లుసహా కొండపోచమ్మ సాగర్‌ వరకు మొత్తంగా 17 చోట్ల రెండేసి చొప్పున 34 హెలిప్యాడ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లోని ప్రతి ప్యాకేజీ వద్ద హెలిప్యాడ్, స్టాఫ్‌ క్వార్టర్స్, సమాచార, సీసీ కెమెరాల వ్యవస్థలు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.44.53 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం కాళేశ్వరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఖరీఫ్‌ నుంచే గోదావరి వరద నీటిని వీలైనంత ఎక్కువగా ఎత్తిపోయాలని ప్రభత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా పనులు పూర్తవుతున్నాయి.

మేడిగడ్డ వద్ద గోదావరి వరద గరిష్టంగా గతంలో 28 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. అంటే ఏకంగా 244 టీఎంసీల నీరు ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లి వద్ద సైతం గతంలో 20 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చిన సందర్భాలున్నాయి. ఈ సమయంలో వరద నిర్వహణ, నియంత్రణ, గేట్ల ఆపరేషన్‌ అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి బ్యారేజీ వద్ద వరదపై పర్యవేక్షణ, పంపులు, మోటార్ల నిర్వహణ, విద్యుత్‌ వ్యవస్థల నిర్వహణకు సిబ్బంది నిర్మాణ ప్రాంతంలోనే ఉండాల్సిన అవసరం ఉంది.

బ్యారేజీల వద్ద నది ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ, ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హైఫ్లడ్‌ లెవల్‌కు చాలాఎత్తులో వాచ్‌ టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలని ఇటీవలి సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ప్రస్తుతమున్న హెచ్‌ఎఫ్‌ఎల్‌ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్‌ఎఫ్‌ఎల్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్మాణాలు చేయాలని సూచించారు. ప్రతి దగ్గర సబ్‌ డివిజన్‌ కార్యాలయం, స్టాఫ్‌ క్వార్టర్స్, సీసీ కెమెరాలు, సమాచార వ్యవస్థల నిర్మాణం చేయనున్నారు. వీటికి మొత్తంగా 44.53 కోట్లు అవసరం ఉంటుందని లెక్కగట్టారు. ఈ వ్యయాలకు త్వరలోనే పరిపాలనా అనుమతి రానుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top