నేటి సార్వత్రిక ఓట్ల లెక్కింపు కోసం భారీ భద్రత | Sakshi
Sakshi News home page

నేటి సార్వత్రిక ఓట్ల లెక్కింపు కోసం భారీ భద్రత

Published Thu, May 15 2014 11:45 PM

Heavy Security for general election counting of today

 సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో శుక్రవారం జరగనున్న సార్వత్రిక (ఎంపీ, ఎమ్మెల్యే) ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డికి సమీపంలోని ఫసల్‌వాది ఎంఎన్‌ఆర్ కళాశాల, కాశీపూర్‌లోని డీవీఆర్ కళాశాల, పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వ విద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎస్పీలు, ఒక ఓఎస్‌డీ, ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 90 మంది ఎస్‌ఐ/ఆర్‌ఎస్‌ఐలు, 9 స్పెషల్ పార్టీ పోలీసులు, 150 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

 ఆయా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎవరూ కూడా గుమిగూడి ఉండరాదని ఎస్పీ శెముషీ హెచ్చరించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, ముఖ్య గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్లు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో 30 పోలీసు చట్టం, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎస్పీ సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవరు కూడా అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, ఇంకు పెన్నులు, బ్లేడ్లు, చాకులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు, సెల్‌ఫోన్‌లు, సుత్తెలు వంటివి తీసుకుని వెళ్లరాదని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా శాంతికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement
Advertisement