ఉప్పొంగిన గోదారి

Heavy Floods To River Godavari From Maharashtra - Sakshi

రైతన్నల్లో ఆనందం.. జోరందుకోనున్న సాగు

మహారాష్ట్ర నుంచి భారీగా ప్రవాహం

ఉధృతంగా పెన్‌గంగ, ప్రాణహిత

మత్తళ్లు పోస్తున్న చెరువులు.. కొట్టుకుపోయిన రోడ్లు

నిండుకుండలా కడెం.. రెండు గేట్ల ఎత్తివేత

తాలిపేరు ఏడు గేట్ల ఎత్తివేత

కాళేశ్వరం/ఆదిలాబాద్‌/చర్ల: గోదారి గలగలమంటూ కదలి వస్తోంది.. ఇప్పటిదాకా నీటిచుక్క కోసం ఆకాశం వైపు చూసిన అన్నదాతలో ఆనందం కనిపిస్తోంది.. రాష్ట్రంలో ఇటీవలి వరకు స్తబ్ధుగా ఉన్న సాగు పనులు ఇక జోరందుకోనున్నాయి! ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ వర్షాలు రైతన్నకు మేలేనని, ఇప్పటికే నాటిన విత్తుకు ప్రాణం పోస్తాయని అధికారులు చెబుతున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత వరద కలవడంతో సోమవారం గోదారి ప్రవాహం మరింత పెరిగింది. ఆదివారం ఇక్కడ గోదావరి 7.1 మీటర్ల ఎత్తున ప్రవహించగా.. సోమవారం సాయంత్రానికి 7.2 మీటర్లకు చేరింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. కాళేశ్వరం వద్ద 2.43 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీ వద్ద 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు తరలుతోంది. అలాగే మంగపేట మండలం కమలాపురం బిల్ట్‌ ఇంటేక్‌వెల్‌ వద్ద గోదావరి నీటిమట్టం 8.4 అడుగులకు చేరింది. వాజేడు మండలం పేరూరు వద్ద ఆదివారం సాయంత్రం 5.57 మీటర్లు ఉన్న గోదావరి ప్రవాహం సోమవారం సాయంత్రానికి 8.47 మీటర్లకు పెరిగింది.

నిండిన కడెం..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 697.625 అడుగులకు చేరింది. 10,732 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే రెండు గేట్ల ద్వారా 12,496 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భైంసాలో గల సుద్దవాగు గడ్డెన్న ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా, 357.5 మీటర్లకు చేరుకుంది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది.

మత్తడివాగు ప్రాజెక్టు నీటిమట్టం 277.5 మీటర్లు కాగా, 275 మీటర్లకు చేరింది. కుమురం భీం ప్రాజెక్టు ఫ్లోర్‌లెవల్‌ 243 మీటర్లు కాగా 240 మీటర్లకు నీరు చేరుకుంది. గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నాయి. పెద్దవాగు పరిసర లోతట్టు ప్రాంతాలైన వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, దహేగం, పెంచికల్‌పేట మండలాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. దహేగాం మండలం పరిధిలోని పెద్ద చెరువు నీరు పెరగడంతో కాగజ్‌నగర్, దహేగాం ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. మండల కేంద్రంతో పాటు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తాలిపేరుకు భారీ వరద
ఉమ్మడి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు చెందిన 7 గేట్లను ఎత్తారు. 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్ట్‌ వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు.

నీల్వాయి వాగులో రైతు గల్లంతు
ఆదిలాబాద్‌ జిల్లాలోని నీల్వాయి వాగు దాటుతూ ఓ రైతు గల్లంతయ్యాడు. ప్రాజెక్ట్‌ పునరావాస కాలనీ గెర్రెగూడెంకు చెందిన మోర్ల సోమయ్య (60) సోమవారం సాయంత్రం నీల్వాయిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు రుణం కోసం వెళ్లాడు. అప్పుడు వాగులో వరద ప్రవాహం లేదు. తిరుగు ప్రయాణంలో వాగు వద్దకు రాగానే మత్తడి నుంచి వాగులోకి వరద రావడం మొదలైంది. వరద ఉధృతి పెరగడంతో జనం చూస్తుండగానే సోమయ్య వాగులో పడి గల్లంతయ్యాడు. కుటుంబీకులు, గ్రామస్తులు వాగులో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top