నాన్చుడో.. తేల్చుడో..!

Raise submergence issues, Telangana irrigation officials told - Sakshi

కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల వివాదంపై నేడు ఢిల్లీలో కీలక భేటీ

సమావేశానికి హాజరుకానున్న సీఎస్‌ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ

లేవనెత్తాల్సిన అంశాలపై సీఎస్‌తో కలసి మంత్రి హరీశ్‌ సుదీర్ఘ సమీక్ష

ఏఐబీపీపై గడ్కరీ అధ్యక్షతన జరిగే భేటీకి హాజరు కానున్న హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నానుతున్న వివాదాలపై ఏడాదిన్నర తర్వాత కేంద్ర జల వనరుల శాఖ గురువారం ఢిల్లీలో నిర్వహిస్తున్న సంయుక్త సమావేశం కీలకంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం నీటి వాటాలు, వినియోగం, ప్రాజెక్టుల పరిధి, కొత్త ప్రాజెక్టులు, గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటితో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాల అంశాలన్నీ అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో అయినా కేంద్రం స్పష్టతనిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.  

వ్యూహంపై మంత్రి హరీశ్‌ దిశానిర్దేశం..
కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్రప్రసాద్‌ సింగ్‌ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో గురువారం ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. తెలంగాణ తరఫున సీఎస్‌ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులతో పాటు ఏపీ అధికారులు హాజరవుతున్నారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటాపై గట్టిగా పోరాడాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఢిల్లీ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం జలసౌథలో ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి హరీశ్‌ సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్‌ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై సమీక్షించారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలు, తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.

పట్టిసీమ, పోలవరం నిర్మాణంతో తెలంగాణకు దక్కే 90 టీఎంసీలకై గట్టిగా వాదించాలని, రెండు రాష్ట్రాలకు కృష్ణాలో కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించి రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరాలని ఆదేశించారు. ఆర్డీఎస్‌ వాటాలు, టెలీమెట్రీ స్టేషన్ల సత్వర ఏర్పాటుపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వికాస్‌ రాజ్, ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, నాగేందర్‌రావు, సీఈ సునీల్‌ పాల్గొన్నారు.

ఏఐబీపీ ప్రాజెక్టులపైనా సమీక్ష..
ఇక గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ అధ్యక్షతన జరగనున్న ఏఐబీపీ ప్రాజెక్టుల సదస్సులో మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏఐబీపీ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై మంత్రి హరీశ్‌ సమీక్షించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా ప్రాధాన్యంగా పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణాలోని 11 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.659 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో దేవాదుల ప్రాజెక్టు కిందే రూ.460 కోట్ల పెండింగ్‌ నిధులు రావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక ఈ ప్రాజెక్టులకు క్యాడ్‌ వామ్‌ కింద రూ.వెయ్యి కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. వీటిపై మంత్రి సమీక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top