అక్రమార్కులపై పీడీ పంజా!

Government is going to use PD Act on illegal lay-outs - Sakshi

అనధికార లే–అవుట్లపై కొరడా ఝళిపించనున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ లే–అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పీడీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయనుంది. అనుమతుల్లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లను నియంత్రించడానికి కఠిన చర్యలు తప్పవని భావించిన సర్కారు.. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పదేపదే అనధికార లే–అవుట్లు చేస్తున్న డెవలపర్లు/భూ యజమానులపై ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆలోచన చేస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనుంది.

లే–అవుట్లకు అనుమతిలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి పాత్ర ఉండదు. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ (డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌)కి మాత్రమే లే–అవుట్లను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పట్టించుకోని రియల్టర్లు.. పంచాయతీల పాలకవర్గాలతో కుమ్మక్కైఅడ్డగోలుగా వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు జారీ చేసే లే–అవుట్లతో పోలిస్తే.. ఇందులో స్థలాల ధరలు చౌకగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ఇబ్బడిముబ్బడిగా అనధికార లే–అవుట్లు వెలుస్తున్నాయి. 

దాదాపు 3 వేల పైచిలుకే..!
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా అక్రమ లే–అవుట్లు ఉన్నట్లు పంచాయతీరాజ్‌శాఖ లెక్క తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి అనధికార లే–అవుట్లు చేసిన రియల్టర్లపై పీడీ చట్టం మేరకు కేసులు నమోదు చేసే అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనుంది. ఈ అంశంపై పోలీసుశాఖతో కూడా చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top